సార్వత్రికానికి సై

Election Commission announces schedule for LS polls– దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ
– ఏప్రిల్‌ 19న తొలిదశ, జూన్‌ 1న ఏడో దశ
– జూన్‌ 4న కౌంటింగ్‌
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్‌ ప్రకటించింది. ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఒడిశా అసెంబ్లీకి మాత్రం నాలుగు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడో దశల్లో కొనసాగే ఈ ప్రక్రియలో జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని సీఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.
రాష్ట్రంలో…
తెలంగాణలో మొత్తం 17లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువిచ్చింది. జూన్‌ 4న కౌంటింగ్‌ జరుగుతుంది.
న్యూఢిల్లీ : ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని అన్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొనకూడదని సీఈసీ స్పష్టం చేసింది. శనివారం నాడిక్కడ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధూలతో కలిసిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85 ఏండ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో పోలింగ్‌ స్టేషన్‌కు రాలేని స్థితిలో ఉన్నవారు ఇంటి నుంచి ఓటు వేయవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఉపయోగించుకోవొద్దని సూచించారు. అరుణాచల్‌, గోవా, సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో పార్లమెంటరీ స్థానాల అభ్యర్థులు గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మూడు రాష్ట్రాలు, మిగతా కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులకు మాత్రం రూ.75 లక్షల పరిమితి విధించినట్లు పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సాలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 40 లక్షలు, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు రూ.28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయకూడదని, కులం, మతం ఆధారంగా ఓట్లు అడగొద్దని రాజకీయ పార్టీలకు సూచించారు. వ్యక్తిగత జీవితం లక్ష్యంగా విమర్శలు ఉండొద్దని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రత్యర్థులను అవమానపరిచేలా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టకూడదని, ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు వికలాంగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నకిలీ సమాచారంతో జాగ్రత్తగా ఉండాలని రాజీవ్‌ కుమార్‌ హెచ్చరించారు. పార్టీలు బాధ్యతాయుతమైన సోషల్‌ మీడియా ప్రవర్తనను కలిగి ఉండాలని, నకిలీ వార్తల మూలకారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలింగ్‌ ఇలా…
543 స్థానాల్లో 412 జనరల్‌ కేటగిరీ, 84 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి. మొదటి దశ(ఏప్రిల్‌ 19)లో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు, రెండో దశ (ఏప్రిల్‌ 26)లో 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు, మూడో దశ (మే 7)లో 12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు, నాలుగో దశ (మే 13)లో 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఐదో దశ (మే 20)లో 8 రాష్ట్రాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు, ఆరో దశ (మే 25)లో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు, ఏడో దశ (జూన్‌ 1)లో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.
అరుణాచల్‌ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, చండీఘర్‌, డామన్‌ డయ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, కేరళ, లక్షద్వీప్‌, లడఖ్‌, మిజోరం, మేఘాలయ, నాగలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ ఇలా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్‌ జరనుంది. అదే విధంగా కర్ణాటక, రాజస్థాన్‌, త్రిపుర, మణిపూర్‌ నాలుగు రాష్ట్రాల్లో రెండు దశల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం రాష్ట్రాల్లో మూడో దశల్లోనూ ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ మూడు రాష్ట్రాల్లో నాలుగు దశల్లోనూ మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌ ఐదు దశల్లో, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆరు దశల పోలింగ్‌ ఏ రాష్ట్రంలో కూడా లేదు.
అసెంబ్లీలకు..
ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దశలోనూ, ఒడిశా రాష్ట్రానికి నాలుగు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్‌సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలతోపాటు మే 13న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఒరిస్సా రాష్ట్ర అసెంబ్లీకి లోక్‌సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13, మే 20, మే 25, జూన్‌ 1న పోలింగ్‌ జరుగనుంది.
నాలుగో దశలో…
175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కాలపరిమితి జూన్‌ 11న ముగియనుంది. 175 స్థానాల్లో 139 జనరల్‌ కేటగిరీ, 29 ఎస్‌సి, 7 ఎస్‌టి రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి. అలాగే 25 లోక్‌సభ స్థానాలకు 20 జనరల్‌ కేటగిరీ, 4 ఎస్‌సి, 1 ఎస్‌టి రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 17 జనరల్‌ కేటగిరీ, 3 ఎస్‌సి, 2 ఎస్‌టి రిజర్వ్‌ స్థానాలు ఉన్నాయి. నాలుగో దశలో ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌ జరగనుంది.
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు..
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏడు విడతల్లో ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ కంటోన్మెంట్‌ స్థానానికి నాలుగో విడతలో మే 13న ఎన్నిక జరగనుంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.

మొత్తం ఓటర్లు 96.8 కోట్లు
– పురుషులు 49.7 కోట్లు 8 మహిళలు 47.1 కోట్లు
– ట్రాన్స్‌ జండర్స్‌ 48,044
– 18-19 ఏండ్ల వయస్సుండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత 1.85 కోట్లు.
– 20-29 మధ్య వయస్సు గల ఓటర్లు 19.74 కోట్లు
– 85 ఏండ్లు పైబడిన వృద్ధులు 81,87,9999 మంది
– వందేండ్లు పైబడిన వృద్ధులు 2,18,442 మంది
– వికలాంగులు 88,35,449 మంది.
– అందులో 52,65,076 మంది పురుషులు, 8 35,69,933 మంది మహిళలు, 440 ట్రాన్స్‌ జండర్స్‌
ఈవీఎంలు : 55 లక్షలు పోలింగ్‌ కేంద్రాలు :10.5 లక్షలు
పోలింగ్‌ అధికారులు, భద్రతా సిబ్బంది :1.5 కోట్లు
ఎన్నికల షెడ్యూల్‌- ఎన్నికల ప్రక్రియ తేదీ
నోటిఫికేషన్‌ : ఏప్రిల్‌ 18 (గురువారం)
నామినేషన్ల గడువు : ఏప్రిల్‌ 25 (గురువారం)
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్‌ 26 (శుక్రవారం)
ఉపసంహరణ : ఏప్రిల్‌ 29 (సోమవారం)
పోలింగ్‌ : మే 13 (సోమవారం)
ఓట్ల లెక్కింపు : జూన్‌ 4 (మంగళవారం)