బీఎస్పీకి ఆర్‌ఎస్‌ బైబై

బీఎస్పీకి ఆర్‌ఎస్‌ బైబై– మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందనీ, అందుకు పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్దిసేపటికే ఆయన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తన రాజకీయ భవిష్యత్‌ గురించి చర్చించారు. లోక్‌సభ ఎన్నికల పొత్తులో భాగంగా నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు శుక్రవారం బీఆర్‌ఎస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే శనివారానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ఆపార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ”బీఆర్‌ఎస్‌-బీఎస్పీ పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగం చేయాలని కవిత అరెస్టుతో సహా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలను వదిలేయలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా” అంటూ ‘ఎక్స్‌’లో రాసుకొ చ్చారు. తెలంగాణలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అని అయన అన్నారు. అయితే నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ప్రవీణ్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే బరిలోకి దింపాలని మాజీ సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.