మీ గోళ్ళు చెబుతుంటాయి

నిజమే గోళ్ళూ మాట్లాడుతాయి. కాకపోతే కాస్త మనసు పెట్టి వింటే – గోళ్ళని చూస్తే శరీర రుగ్మతల్ని అవి తెలియజేస్తూ ఉంటాయి. గోళ్లు కేవలం వేళ్లకి రక్షణ, బలం మాత్రమే కాదు. అవి ఆరోగ్యానికి సూచనలు కూడా. గోళ్లు ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్‌ బి, సి లోపం వల్ల గోళ్లు నెర్రులిచ్చే అవకాశం ఉంది. ప్రొటీన్లు, విటమిన్‌ ఈ, విటమిన్‌ ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఇవన్నీ లభించేలా తగిన పోషకాహారం తీసుకోవాలి. హానికారక బ్యాక్టీరియా గోళ్లలో చేరి ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది.
గోళ్ల స్వభావం ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. కొందరిలో అవి మందంగా, వేగంగా పెరగవచ్చు. లేదా పగిలి ముక్కలవటమో, చీలిపోవటమో, పొరలు పొరలుగా వూడిపోవటమో జరగవచ్చు. గోరు నెలకి సుమారు 2 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. శీతాకాలంలో కన్నా వేసవిలో ఎక్కువ వేగంగా పెరుగుతుంది. మధ్య వేలు గోరు అన్నింటికన్నా వేగంగా పెరుగుతుంది. బొటనవేలు గోరు అతి నెమ్మదిగా పెరుగుతుంది. కాలివేళ్ల గోళ్లు చేతి గోళ్ల కన్నా మందంగా, గట్టిగా ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి.
గర్భవతుల గోళ్లు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల ఎక్కువ వేగంగా పెరుగుతాయి. గోళ్లని తవ్వడానికి, గిచ్చడా నికి ఉపయోగించకూడదు. గోళ్లను ఎప్పుడూ పూర్తిగా తెంచివేయకూడదు. మరీ ఎక్కువ పొడవుగా పెంచకూడదు.
గోటి రంగుని చూసి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పాలిపోయి, తెల్లగా తళతళలాడే గోళ్లు ఏమంత మంచివి కావు. శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనను ఇవి అందిస్తాయి. శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికనూ ఇవి చేస్తాయి. ఇక గుండె లేదా లివర్‌ పనితీరులో ఏదన్నా లోపం ఉన్నప్పుడు కూడా గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. గోళ్లు పసుపుపచ్చగా ఉంటే చూసేవాళ్లకి కూడా వెగటు పుట్టిస్తాయి.
సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్‌ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది. పొగతాగేవారిలో, నెయిల్‌ పాలిష్‌ను ఎడాపెడా వాడేవారిలో కూడా గోళ్లు ఇలా పసుపురంగులోకి మారిపోతుంటాయి. అలవాట్లను మానుకోమంటూ హెచ్చరిస్తుంటాయి.
కొంతమందికైతే గోళ్లు పెరగనే పెరగవు. కొన్నిసార్లు పెరిగినా పాలిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి గోళ్లు గల వారికి రక్తహీనత, పోషకాహార లోపం ఉందని గ్రహించాలి. దీని వల్ల గుండె లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొందరి గోళ్లు మందంగా పసుపు రంగులో, నెమ్మదిగా పెరుగు తుంటాయి. ఇలాంటి గోళ్లు గలవాళ్లు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విధిగా ధైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు. గోరు మొత్తం చాలాకాలం పాటు పసుపురంగులోకి మారిపోయి ఉంటే అది డయాబెటిస్‌, ధైరాయిడ్‌ వంటి వ్యాధులకు సూచన కావచ్చు. గోళ్లు పెళుసుగా ఉంటే వేడినీళ్లలో కొంత నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్‌ క్రీము లేదా లోషన్‌ రాసుకోవాలి.
గోళ్ళు సాధారణంగా కొందరికి పెచ్చులూడిపోతుంటాయి. మరి కొందరికి విరిగిపోతుంటాయి. ఇది కూడా శరీరం లోని క్షారం లేదా కాల్షియం శాతం సరిపడనంతగా తీసుకోనట్లు లెక్క. దీనివలన ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కాబట్టి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. హారిజంటల్‌ రిడ్జస్‌ ఉన్నట్లయితే శరీరంలో జింక్‌ బాగా లోపించినట్లు అర్థం. ఇది అనారోగ్యానికి సూచనగా చెప్పవచ్చు. విటమిన్లను తీసుకోవాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది.
గోళ్ళు గోధుమ రంగులోకి మారి ఉంటాయి. ఇది దాదాపుగా 50 ఏళ్ళ వయస్సుపైబడిన వారిలో కనిపిస్తుంది. విటమిస్‌-12 నశించిందని అర్థం. గోళ్ళు పైకి వంకరలు తిరిగి ఉన్నట్లయితే మరింత ఇబ్బందికరం. శరీరంలో తగినంత ఇనుపధాతువు లేదనడాన్ని సూచిస్తుంది. ఇలాంటప్పుడు డాక్టరును సంప్రదించి, వారి సలహా మేరకే నడుచుకోవాలి. గోళ్ళు కత్తిరించడం ఒక ఆరోగ్యకర అలవాటు. ఎందుకంటే అది మురికిని, సూక్ష్మక్రిములను గోళ్ళు మరియు వేళ్ళ మధ్య పేరుకోకుండా చేస్తుంది. ప్రాచీన కాలంలో గోళ్ళు కత్తిరించుకునే సాధనాలు కూడా లేవు. పదునైన వస్తువులైన కత్తెర, చాకు వంటి వాటితో గోళ్ళు కత్తిరించుకునేవాళ్ళు.
గోళ్ళ ఆకృతులు అనేక రకాల వ్యాధులను తెలియజేస్తాయి. చేతివేళ్ళ మొదల్లో వాపు వచ్చిందంటే దాన్ని క్లబ్బింగ్‌ (షశ్రీబbbఱఅస్త్ర) అంటారు. గుండె జబ్బులను సూచిస్తుంది. గోళ్ళపై నీలం రేఖలు పై నుంచి కిందకు వ్యాపించి ఉంటే శరీరంలో ఎప్పటినుండో ఉన్న వ్యాధిని, గోళ్ళ కింద నల్లనవుతుంటే, ఆకృతి మారి గోళ్ళు కదులు ఉంటే శ్వాస అవరోధం, ఆయాసంలను తెలియజేస్తాయి. గోళ్ళ ముందు భాగంలో నొక్కితే సొట్ట పడిందంటే, దాన్ని ‘పిట్టింగ్‌’ అంటారు. ఇది సోరియాసిస్‌, మూత్ర సంబంధ వ్యాధులలో కనబడుతుంది. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు.
గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్‌ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.
ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం పిల్లలు, 45 శాతం మధ్య వయస్కులు, 25 శాతం వృద్ధులు గోళ్ళు కొరికే అలవాటుకు బానిసైపోయారని అధ్యయనంలో తేలింది. గోళ్ళు కొరకడం కూడా ఫ్యాషనైపోయిందని, దాన్ని కూడా స్టైల్‌గా కొరుకుతున్నారని స్టడీలో తేలింది. సంతోషంగా, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడని వారు గోళ్ళు కొరకడం మొదలెట్టేస్తున్నారు. చాలామందిలో గోళ్ళు కొరికే అలవాటు బాగా కనపడుతుంది. చేతి గోర్లను కొరకటం అనేది ఒక ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిసార్డర్‌’గా పేర్కొనవచ్చు
గోళ్ళు కొరకకూడదని తెలిసినా, లేదా పెద్దలు చెప్పినా వినిపించుకోరు. అలా చేస్తే అరిష్టమనీ.. జీవితానికి చాలా సమస్యలొస్తాయని చెబుతారు కూడా. ఏదిఏమైనా ఒక సైంటిఫిక్‌ విషయమేమంటే గోళ్ళ చివరినుంచి ప్రతికూల శక్తి బయటకి వెళ్తుంటుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి లోపలకి ప్రవేశిస్తుంది. అదే కాక ఎంత శుభ్రం చేసినా గోళ్ళల్లో మట్టి, సూక్ష్మక్రిములు వుంటూ వుంటాయి. లోపలకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తాయి. పిల్లలు ఒక్కోసారి వాటిని మింగేయవచ్చు. అరుదుగా పేగులలో ఎక్కడైనా గుచ్చుకుని ఒక్కోసారి ఆపరేషన్‌ దాకా వెళ్ళచ్చు. ఇన్ని విధాల మనకి నష్టం కలిగిస్తుంది కనుకే గోళ్ళు కొరకటం అరిష్టం అంటారు.
గోళ్ళు ప్రాణం ఉన్నంత వరకూ పెరుగుతూనే ఉంటాయి. ఈ పెరుగుదలలో మనిషికి మనిషికీ కొంత వ్యత్యాసం ఉంటుంది. చేతిగోళ్ళు రోజుకు సుమారు 0.1 మి.మీ. పెరుగుతాయి. కాలిగోళ్ళు ఇందులో కేవలం మూడో వంతు మాత్రమే పెరుగుతాయి. పగటివేళ, వేసవికాలం, మగ వాళ్ళలో, గర్భవతులలో చేతివేళ్ళు, ముఖ్యంగా మధ్యలోని మూడువేళ్ళ గోళ్ళు వేగంగా పెరుగుతాయి. రాత్రుళ్ళు, ముసలితనం, శీతాకాలం, గోళ్ళ వేగం తగ్గుతుంది.
కొందరిలో గోళ్లు వేలి చివర వరకు పెరగవు. పుట్టుకతోనే, వంశపారం పర్యంగా కొన్ని గోళ్ళ జబ్బులు వస్తాయి. గోళ్ళు లేకుండా జన్మించడాన్ని ‘అనో నైభియా’ అంటారు. కొందరిలో ఒకే వేలికి రెండు, మూడుగోళ్ళు ఉంటాయి. కొందరిలో గోళ్లు కేవలం పలుచని పొరలాగా ఉండి, తరచూ ఊడిపోతూ ఉంటాయి. గోరుకు, వేలి కొనకు మధ్య ఉన్న భాగం ఆకృతి మారి ఉబ్బినట్లు ఉండటాన్ని ‘క్లబ్బింగ్‌’ అంటారు. ఇది ఉన్నట్లయితే అంతర్గతంగా ఉన్న అనేక రుగ్మతలకు సూచిక. సోరియాసిస్‌, లైఖన్‌ప్లానస్‌ వంటి చర్మవ్యాధులు గోళ్ళకు సోకుతాయి.
అనేక ఫంగస్‌ వ్యాధులు గోళ్ళకి సోకి, గోళ్ళను నాశనం చేస్తాయి. అనేక గీతలు, గుంటలు గోళ్ళపై కన్పిస్తాయి. సిఫిలిస్‌ అనే లైంగిక వ్యాధి కూడా గోళ్ళకి వ్యాపించవచ్చు. కొన్ని మందులు కూడా గోళ్ళ రంగును మార్చి, అందవిహీనంగా చేస్తాయి. పులిపిరులు, హెర్పిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా గోళ్ళకు సోకుతాయి. కొన్ని జబ్బుల వలన రక్తపు చుక్కలు గోళ్ళ క్రింద ఉంటాయి.
కొందరిలో గోళ్లకింద అనారోగ్య కండరం పెరిగి ఇబ్బంది కలిగిస్తే, మరి కొందరిలో గోళ్ళకింద పూర్తి ఖాళీగా ఉంటుంది. విటమిన్ల లోపము వలన కూడా గోళ్ళ ఆకృతి మారుతుంది. రక్తహీనత వలన గోళ్ళు స్పూను ఆకారంలోకి మారతాయి. కొన్ని గుండెజబ్బులు, కిడ్నీల జబ్బులు కూడా గోళ్ళమీద గీతలు సృష్టిస్తాయి. కొందరిలో కాలి బొటనవేలి గోరు లోతుగా పెరిగి, తరచూ విపరీత నొప్పిని, వాపుతో వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గోరు తీసివేయటమే మార్గము.
గోళ్ల అడుగు భాగంలో తెల్లటి చుక్కలు కనిపించడం సర్వసాధారణమైన విషయం. గోళ్లు పెరిగేకొద్దీ, ఈ మచ్చలు కూడా కరిగిపోతూ ఉంటాయి. గోరుకి ఏదన్నా దెబ్బ తగిలినా, లేకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్‌ వచ్చినా కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు మరీ సుదీర్ఘకాలం ఉంటే తప్ప వీటి గురించి అంత భయపడాల్సిన పని లేదు. కానీ తెల్లగా కాకుండా గాఢమైన రంగులో ఏవన్నా మచ్చలు లేక గీతలు ఉండి నొప్పిగా ఉంటే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. అవి ఒకోసారి స్కిన్‌ క్యాన్సర్‌కు సూచన కావచ్చు.
గోళ్లల్లో కెరటిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. పెరుగు, పాలు, వెన్న లాంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లల్లో ఉండే కెరటిన్‌కు మరింత దోహదకారులుగా పనిచేస్తాయి. కాల్షియం, బయొటిన్‌లు గోరు పైభాగాన్ని పటిష్టంగా ఉంచుతాయి. గోళ్లు చిట్లిపోకుండా కాపాడతాయి. తెల్లసొన పోషకాల నిలయం. ఇది గోళ్లల్లో ఉండే కెరటిన్‌ని పటిష్టంగా తయారుచేస్తుంది. తెల్లసొనలో బయొటిన్‌ కూడా అధికపాళ్లల్లో ఉంటుంది.
గుడ్డును ఉడకబెట్టి అందులోని తెల్లసొనను తింటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జింకు లోపం వల్ల గోళ్లు ఎంతో బలహీనంగా ఉండి ఇట్టే చిట్లిపోతుంటాయి. గోళ్ల పైభాగంలో చిన్న చిన్న తెల్లటి మచ్చలు కూడా వస్తాయి. ఇవి రాకుండా, గోళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం గుమ్మడిగింజలు, నువ్వు గింజలు, ఓట్స్‌ తింటే మంచిది. వీటిల్లో జింకు బాగా ఉంటుంది.
మురికిగా ఉండే కాలి వేలిగోర్లు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. సాధారణంగా చాలామందికి కాలిగోర్లు మురికిగా ఉంటాయి. కాని వాటిని శుభ్రం చేసుకోవడం సులభమే. చేయగా చేయగా అందంగా కూడా కనబడతాయి. ఎప్పుడూ గోర్లు బయటికి కనబడుతూనే ఉంటాయి కనుక వాటిని శుభ్రంగా, నీట్‌గా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. కాలి గోళ్ళను పొట్టిగా ఉంచండి. పొడవైన, వంపుతిరిగిన కాలి గోళ్ళు ఎప్పుడూ ఆకర్షణీయమైనవి కాదు. పైగా వాటిని పొట్టిగా పెంచడం వల్ల శుభ్రంగానే కాక చాల చక్కగా కనబడతాయి.
గోళ్లను ఇష్టానుసారం కత్తిరించడం, తుంచడం వంటివి మానేస్తే వాటిని అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మంచి మాయిశ్చరైజింగ్‌ లోషన్‌తో రోజూ గోళ్లకు మసాజ్‌ చేసుకోవాలి. గోళ్ల వద్ద రక్తప్రసరణ సవ్యంగా జరిగితే అవి బలంగా, పొడవుగా పెరుగుతాయి. రోజూ వీలైనన్ని ఎక్కువసార్లు మంచినీళ్లు తాగితే చర్మం వడలిపోకుండా ఉంటుంది. గోళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
విటమిన్లు, కాల్షియం పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకుంటే గోళ్లు అందంగా పెరుగుతాయి. ఆలివ్‌ నూనెలో ముంచిన దూదితో తరచూ గోళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే గోళ్లు నాజూగ్గా మారతాయి. గోళ్లను కొరకడం వల్ల అవి పగిలిపోయి, ఒక్కోసారి రక్తం కారడంతో అందవిహీనంగా మారతాయి. గోళ్ల సందుల్లో మురికిని తొలగించడానికి సూదులు, అగ్గిపుల్లలు వంటివి వాడడం మంచిది కాదు. గోళ్లను టూత్‌ పేస్టుతో రుద్ది కడిగితే రంగు మారిన గోళ్లు మళ్లీ తెల్లగా అవుతాయి.
బేకింగ్‌ సోడాలో నిమ్మరసం కలిపి రుద్దుకున్నా మంచి ఫలితం ఉంటుంది. నెయిల్‌ పాలిష్‌ రిమూరవ్‌లో దూదిని ముంచి అప్పుడప్పడూ గోళ్లను రుద్దినా కూడా సమస్య తీరుతుంది. దూదిని చిన్న చిన్న ఉండలుగా చేసి పాలలో ముంచండి. వీటిని గోళ్ల మీద పెట్టి కాసేపు అలానే వదిలేయాలి. తరువాత తీసేసి చల్లని నీటితో కడిగేసి, ఆపైన మాయిశ్చరయిజింగ్‌ క్రీమ్‌ తో గోళ్లను రుద్దాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే గోళ్లు రఫ్‌గా అవ్వవు. రంగు మారవు. సమస్యలు ఉంటే తీరిపోతాయి. చిన్న చిన్న చిట్కాలు పాటించడం సులువు. కాబట్టి గోళ్ల సౌందర్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ ఏం చేసినా గోళ్ల రంగు మారకపోతే ఒకసారి డాక్టర్‌ ని సంప్రదించండి.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008 577 834