– ఫైనల్లో చతికలబడ్డ ఢిల్లీ
న్యూఢిల్లీ : మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సిబి ఎనిమిది వికెట్లతో ఇంకా మూడు బంతులు మాత్రమే మిగిలిఉండగా విజయం సాధించింది. ఢిల్లీ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సిబి 19.3 ఓవర్లల్లో రెండు వికెట్లు కోల్పోయిసాధించింది. అయితే స్వల్ప లక్ష్యాన్ని కూడా చివరి వరకూ కొనసాగించి ఢిల్లీ తన పోరాటాన్ని ప్రదర్శించింది. అయితే మొత్తంగా ఈ టోర్నిలో వరసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీకి ఈ ఏడాది కూడా నిరాశ తప్పలేదు. గత ఏడాది జరిగిన డబ్ల్యూపిఎల్ తొలి సీజన్‌లో తుదిపోరులో ఢిల్లీపై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది టైటిల్‌ను గెలుచకున్న సంగతి తెలిసిందే.
కాగా, ఆదివారం లక్ష్యఛేదనలో ఆర్‌సిబికి ఓపెనర్లు సోఫియా డివేన్ 32 పరుగులు (27 బంతుల్లో ఒక సిక్స్, ఐదు ఫోర్లు), కెప్టెన్ సృతి మంధనా 31 పరుగులు (39 బంతుల్లో మూడు ఫోర్లు)తో శుభారంభం ఇచ్చారు. ఈ తరువాత ఎలీస్ పెర్రీ- వికెట్ కీపర్ రిచా గోష్ అజేయంగా నిలిచి ఆర్‌సిబికి విజయాన్ని అందించారు. ఎలీస్ పెర్రీ 35 పరుగులు (37 బంతుల్లో నాలుగు ఫోర్లు) రిచా ఘోష్ 17 పరుగులు (14 బంతుల్లో రెండు ఫోర్లు) సాధించారు. ఎలీస్ పెర్రీ ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచింది. పెర్రీ మొత్తంగా 347 పరుగులు చేయడమే కాకుండా 7 వికెట్లూ పడగొట్టింది.
ఈ టోర్నిలో ముందుగా తడబాటును ఎదుర్కొన్నా ఆ తరువాత ఆర్‌సిబి బలంగా పుంజుకుని ఆఖరికి టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ దశలో 8 మ్యాచ్‌ల్లో నాలుగు చొప్పున విజయాలు, ఓటములతో మూడో స్థానంలో ఆర్‌సిబి నిలిచింది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయికి షాకిచ్చిన ఆర్‌సిబి ఫైనల్‌కు చేరుకుంది.
కాగా, ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఢిల్లీ జట్టును.. కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (23), షెఫాలి వర్మ (44) మినహా ఎవరూ రాణించలేదు. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లేలో 61 పరుగులు చేసిన ఢిల్లీకి సోఫీ మోలినక్స్ షాకిచ్చింది. 8వ ఓవర్‌లో వరుసగా 3 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత కూడా ఢిల్లీ వికెట్ల పతనం ఆగలేదు. వచ్చినవాళ్లు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. చివర్లో రాధా యాదవ్ (12), అరుంధతి రెడ్డి (10) బ్యాటు ఝళిపించే ప్రయత్నం చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.