– ఢిల్లీ లిక్కర్ పాలసీలో లబ్ది పొందేలా డీల్
– కేజ్రీవాల్, సిసోడియాలతో కలిసి కుట్ర
– దర్యాప్తులో తేలినట్లు ఈడీ అధికారిక ప్రకటన
– సోదాల టైంలో కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో కలిసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు బదులుగా కవిత, ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో పాలుపంచుకున్నారని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అవినీతి, కుట్రల ద్వారా హౌల్ సేలర్స్ నుంచి కిక్ బ్యాక్ రూపంలో నిరంతరం అక్రమంగా నిధులు ఆప్‌కు మళ్లించబడ్డట్లు తెలిపింది. ఈ కుట్ర ద్వారా కవిత, ఆమె భాగస్వాములు ఆప్‌కు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందాల్సి ఉందని పేర్కొంది. ఈ మొత్తం కుట్రలో లాభాలు/ వసూళ్ల వివరాలు మరిన్ని తేలాల్సివుందని వెల్లడించింది.
ఈ మేరకు సోమవారం ఈడీ కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 15 న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోదాల అనంతరం ఎమ్మెల్సీ కవితను ఈడీ (హెచ్ క్యూఆర్‌ఎస్) ఆఫీస్ అదుపులోకి తీసుకుందని తెలిపింది. 16వ తేదిన స్పెషల్ కోర్టు కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం ఈనెల 23 వరకు ఈడీ కస్టడికి అప్పగించిందని వెల్లడించింది. కాగా ఆమె ఇంట్లో సోదాలు జరుగుతోన్న సందర్భంలో కవిత బంధువులు, సన్నిహితులు ఈడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంది.
రూ. 128.79 కోట్లు సీజ్
ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, తదితర ప్రాంతాలతో సహదేశ వ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఆప్‌కు చెందిన మనీష్ సిసోడియా, సంజరు సింగ్, విజరు నాయర్‌తో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రూ. 128.79 కోట్లు సీజ్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక ప్రాసిక్యూషన్(నేరా రోపణ), 5 సప్లమెంటరీ కంప్లైట్స్‌ను దాఖలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కొనసాగుతోందని ప్రకటనలో స్పష్టం చేసింది.
నేడు సుప్రీంకోర్టుకు కవిత పిటిషన్
ఈడీ అరెస్ట్ పై తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత తొలిసారి సుప్రీంకోర్టు ముందుకు గతంలో ఆమె దాఖలు చేసిన 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ (క్రిమినల్) విచారణకు రానుంది. దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈడీ ఆఫీసుకు మహిళలను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై గతేడాది మార్చిలో కవిత తరపు న్యాయవాది వందన సెఘల్ మొత్తం 105 పేజీల పిటిషన్ వేశారు. దాదాపు ఏడాది కాలంగా ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ నెల 15న ఈ పిటిషన్‌ను జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన బెంచ్ విచారించాయి. ఈ సందర్బంగా కవిత తరపు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ గత ఆదేశాల ప్రకారం ఈనెల 13న నాన్ మిస్ లీనియస్ రోజు రావాల్సిన పిటిషన్, మిస్ లీనియస్ రోజైన 15వ తేదిన బెంచ్ ముందుకు వచ్చిందన్నారు. వచ్చేవారంలో నాన్ మిస్లీనియస్ రోజు ఈ పిటిషన్ విచారించాలన్న విక్రమ్ చౌదరి విజ్ఞప్తితో ధర్మాసనం మార్చి 19కి వాయిదా వేసింది. కాగా అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సోదాల పేరిట ప్రవేశించిన ఈడీ అధికారులు సాయంత్రానికి ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
తన అరెస్ట్‌ను నిరసిస్తూ కవిత న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఒకవైపు సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉండడం, మూడు రోజుల్లో పిటిషన్ మరోసారి బెంచ్ ముందుకు రానున్న టైంలో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని సోమవారం ఉదయం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌కు డైరీ నంబర్ వచ్చినా… సోమవారం లిస్ట్ కాలేదు. అయినప్పటికీ ఈ అంశాన్ని సోమవారం కవిత తరపు న్యాయవాదులు కోర్టు ముందు మెన్షన్ చేయలేదు. ఎలాగు మంగళవారం (నేడు) రెగ్యూలర్ బెంచ్ ముందుకు కవిత పిటిషన్ రానున్న నేపథ్యంలో అదే టైంలో అక్రమ అరెస్ట్ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఎందుకు మూడు రోజులు ముందు అత్యవసరంగా ఆమెను అరెస్ట్ చేశారని వాదించనున్నారు. ఆమె దేశం విడిచి పారిపోవడం లేదని, రాజకీయ నాయకురాలైన తాను.. తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి దూరమయ్యే ఆస్కారం ఉందని బెంచ్‌కు వివరించే అవకాశముంది.