ఫాసిస్టు చట్రంలో దేశం బందీ అయింది కవులు మౌనాన్ని వీడాలి

ఫాసిస్టు చట్రంలో దేశం బందీ అయింది కవులు మౌనాన్ని వీడాలి– సమస్యలపై అక్షరాలను ఎక్కు పెట్టండి : కవి సమ్మేళనంలో బెంగాలీ కవయిత్రి మౌమితా ఆలం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”మణిపూర్‌ మండి పోతోంది. కాశ్మీర్‌ రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, అట్టడుగు వర్గాల ప్రజలు అడుగడుగునా అణచివేతకు గురవుతున్నారు. దేశం ఫాసిస్టు చట్రంలో బందీ అయింది. కవులు మౌనాన్ని వీడాలి. సమస్యలు, బాదలు, అణచివేతకు వ్యతిరేకంగా అక్షరాలను ఎక్కుపెట్టాలి” అని ప్రముఖ బెంగాలి కవయిత్రి మౌమితా ఆలం పిలుపు నిచ్చారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ”కవి సమ్మేళనం” కార్యక్రమంలో ఆమె ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ”సాహిత్యం ప్రజా సమస్యలను ప్రశ్నించే ముఖ్యమైన వేదిక, వాటి మూలాల్ని కవులుగా మనం నిత్యం ప్రశ్నిస్తూనే ఉండాలి. నా రచనలన్ని ఆ కోవలోనే సాగాయి. మణిపూర్‌ అల్లర్లు, ఆర్టికల్‌ 370, సీఏఏ, గౌరీ లంకేష్‌ హత్య, వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని అసువులు బాసిన రోహిత్‌ వేముల, గాజా మారణ కాండను కవిత్వం ద్వారా ప్రపంచానికి చెప్పాను. అట్టడుగు వర్గాల బాధలను వినిపించాను, వినిపిస్తూనే ఉంటాను” అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఐయామ్‌ఏ ముస్లిం ఉమెన్‌ అనే కవిత ద్వారా దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్షరాలను సంధిం చాను. దేశం వెలిగి పోతోంది, అభివృద్ధి చేందిందని పాలకులం టున్నారు. భారత దేశం ఎక్కడ అభివృద్ధి చెందిందో ఫుట్‌ పాత్‌ పక్కన బతుకుతున్న కూలీ నడగండి.. మీకు సమాధానం దొరకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కవులు, రచయితలు తమ కలాలకు పదును పెట్టి సమస్యలపై యుద్ధం చేయా లని సూచించారు. కవి సమ్మేళ నానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాహితి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి మాట్లాడుతూ కవులు రాజకీయా లకు అతీతులు కారు… ఎన్నికలు సమీపంలో ఉన్న ప్రస్తుత తరుణంలో వాటిని ఇతి వృత్తంగా చేసుకుని ఓటు హక్కు వినియోగం, మంచి నాయకులను ఎన్నుకోవడం వరకు తమ కవితలతో ప్రజలను చైతన్య వంతం చేయాలని పేర్కొన్నారు. బెంగాల్‌లోని మారుమూల గ్రామంలో పుట్టిన కవయిత్రి మౌమితా ఆలం మాదిరిగా ప్రజా సమస్యలను ప్రతిబింబించే రచనలు చేయాలని సూచించారు. రక్త మోడుతుంటే… వెన్నెల గురించి ఎలా రాయమంటా రంటూ ఆమె సమాజాన్ని ప్రశ్నించారని గుర్తు చేశారు. పీవోడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ చెరబండ రాజు, శ్రీశ్రీ కవిత్వం ఒకప్పుడు సమా జాన్ని కదిలించిందనీ, అలాంటి కవిత్వం నేడు దరిదాపుల్లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు బెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతం నుంచి వచ్చిన మౌమితా ఆ లోటును పూడ్చుతున్నారని కొనియాడారు. మౌమితా రాసిన కవిత ”నేను ముస్లిం మహిళను … అమ్మకానికి అంగడి సరుకును కాను” తెలుగు అనువాదాన్ని కవయిత్రి సలిమా ఈ సందర్భంగా చదివి వినిపించారు. ఏబూషి నర్సింహ అధ్యక్షత వహించగా, రామకృష్ణ చంద్రమౌళి సమన్వయ కర్తగా వ్యహరించిన కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో మేరెడ్డి రేఖ, తంగిరాల చక్రవర్తి, శరత్‌ సుదర్శి, ఇతర కవులు పాల్గొన్నారు.