
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అటవీ భూమి హద్దులను పటిష్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. బుధవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చింతలపాలెం లో ఉన్న డిస్-రిజర్వ్ చేయబడిన భూమి, ఫీల్డ్ రిజర్వ్ చేయబడిన భూములను గుర్తించి వాటికి సరిహద్దులు పెట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అటవీ భూములకు హద్దులు లేకపోవడం వలన గ్రామస్తులు అటవీ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని కావున ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు అటవీ భూముల సంరక్షణ పై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించి అటవీ రెవెన్యూ ప్రాంతాలను గుర్తించి సరిహద్దులను నిర్ణయించాలని అన్నారు.ప్రభుత్వ భూమిని గుర్తించి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని సూచించారు. కృష్ణ నదిలోని మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని వారిపై తడి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అటవీ, మైనింగ్, రోడ్డు రవాణా, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇట్టి వారిపై అటవీ హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అలాగే ఎలాంటి పన్నులు చెల్లించకుండా, అనధికారికంగా నడిచే వాహనాలపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట ఆర్టీవో సురేష్ రెడ్డి నీ కలెక్టర్ ఆదేశించారు. జాన్ పహాడ్ దగ్గరలో ఉన్న పసుపు బోర్డు అడవి ప్రాంతంలో సాగర్ కాలువకు ఇరువైపులా ఉన్న అటవీ భూములలో సాగర్ నీటిని అక్రమంగా తరలించి అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పోలీసుల అధికారుల సహకారంతో భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే , జాయింట్ కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డి టి డబ్ల్యూ ఓ శంకర్, ఆర్టీవో సురేష్ రెడ్డి, జిల్లా మైనింగ్ అధికారి సుధాకర్ రెడ్డి, తాసిల్దార్ టి సురేందర్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.