
నవతెలంగాణ – భువనగిరి
యాసంగి సాగు చేసిన రైతుల బతుకులు ఆగమవుతున్నాయి. రోజురోజుకు వందలాది ఎకరాల పంట ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ వట్టి పోతున్నాయి కరువుకూరల్లో చిక్కుకొని అన్నదాతలు విలవిలలాడుతున్నారు. గడ్డి లేక జీవాలు తల్లడిల్లుతున్నాయి. ఎండిన పంటలు పోను పొట్ట దశకు వచ్చిన వరిపంటనైనా ఇంటిని తీసుకెళ్తామనుకున్న రైతుపై ప్రకృతి కన్నెర్ర చేసింది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 93 వేల,232.01 ఎకరాలలో వరి సాగు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5143 ఎకరాల పంటలు ఎండిపోయాయి ,వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే పదివేల ఎకరాల పంట ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. మరో ఐదు నుండి పదివేల ఎకరాల పంట ఎండిపోయే అవకాశం ఉంది. ఎండిన పంటలకు కొందరు రైతులు నిప్పు పెడుతుంటే మరికొందరు రైతులు పశువులను మేపుతున్నారు.
మండలాలు వారిగా వివరాలు
యాసంగి 23 -24 సంవత్సరం రైతులు వేసిన పంట , ఎండిపోయిన పంటలు ఎకరాలలో
మండలం వేసిన పంట. ఎండిపోయిన
పంట
1.అడ్డగూడూరు 11,368.14, 150
2 .ఆలేరు 11,305.30. 68,
3.ఆత్మకూర్ ఎం 19.690.14 81
4.గుండాల 14,295.36 220
5.మోత్కూరు 10,465.30 200
6 పోచంపల్లి 28,656.05 54
7. భువనగిరి 21,792.12 450
8. బీబీనగర్ 13,852.12 40
9. చౌటుప్పల్ 14.724.20 625
10. నారాయణపూర్ 9.775.28 750
11. రామన్నపేట 28,640.28 210
12. వలిగొండ 40.801.34 1050
13.బొమ్మలరామారం 9,880.13 250
14.మెాట కొండూర్ 13,515.32 220
15. రాజాపేట 16,605.09 485
16. తుర్కపల్లి 15.480.24 140
17. యాదగిరిగుట్ట 12,380.13 150
——————————————————————-
జిల్లా మొత్తము 293,232.01 5143
——————————————————————–
సర్కారు ఆదుకోవాలి.
భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ వట్టిపోయి పంటలు ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు రైతులకు భరోసా కల్పించవలసి ఉంది . ఆ భరోసా కరువైంది. ప్రభుత్వం సరైన అంచనా వేసి నష్టపరిహారం చెల్లించడంలో వెనుకంజ వేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నివేదికలు పంపుతున్నాం: అనురాధ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎండిపోయిన పంట నష్టం వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖకు నివేదికలు పంపుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ తెలిపారు.