ఓ మేరీ ప్యారీ దోస్త్‌…

ఓ మేరీ ప్యారీ దోస్త్‌...ఓ మేరీ ప్యారీ దోస్త్‌…
ఈ రంజాన్‌ మాసపు
నెలవంక కొసల్లో కూసోని
కాసేపు ముచ్చటిద్దాం రా..!
అనంతమైన అంకెలను
విసుగ్గోక తవ్వుతూ
అంతుపట్టని అక్షరాల
ఓపిగ్గా పిలుస్తూ
బాల్యపు కాగితాల్లో
కదలకుండా ఎంతసేపని
కూర్చుంటావ్‌ …రా..!
భూమిపై లేలేత అడుగులేసినట్టు
అక్షరాలను నొప్పించక రాసే
సున్నిత మనసున్నోడా…
శాంతి కపోతాన్నెగరేసినట్టు
బొమ్మల హత్తుకు గీసే
ప్రేమా హృదయుడా..!
నీ దోస్తాన్నూ వెంటేసుకురా
ప్రపంచాన్ని గీద్దాం..!
మన పరిచయానికి వీడుకోలుకు
మధ్య గడిచిన సంభాషణకు
సర్వానికి సమాధానమైన
చిరునవ్వుల చల్లుతూ రా..!
ఎంత అరిచినా వినని సమాజాన
సమస్త గాయాల మోసే
నీ మౌనమో అణుబాంబు
అందరినీ అల్లుకునే
నీ స్నేహమే ఒక విశ్వమని రా..!
రా… మేరీ ప్యారీ దోస్త్‌…
మఖ్దూం చెప్పినట్టు
”బతుకు వెంటబెట్టుకు నడుద్దాం
లోకాన్ని వెంటబెట్టుకు నడుద్దాం
మనం నడిస్తే కాలాన్నే
వెంటబెట్టుకు నడుద్దాం”
…రా..!
-అమృతరాజ్‌