అధికారమే పరమావధి

Power is supreme– ఓటర్లను ప్రలోభపెట్టే రాజకీయాలు
– అసమ్మతిని అణచివేస్తున్న మోడీ సర్కారు..
– లోక్‌సభ ఎన్నికలకు ముందు అస్త్రశస్త్రాలు
– ప్రజాస్వామ్య దేశంలో ఈ విధానం సరికాదు : కేంద్రం తీరుపై మేధావులు, సామాజికవేత్తల ఆందోళన నిరసన గళాలపై ఉక్కుపాదం
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఎన్నికల పండుగకు సిద్ధమవుతున్నది. 18వ లోక్‌సభకు ఏప్రిల్‌ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లోనూ ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ భావిస్తున్నది. ఇందుకోసం తమ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్న సర్కారు అధికార బలాన్ని సైతం వినియోగిస్తున్నది. దేశంలో ఏ వర్గం నుంచైనా ‘అసమ్మతి’కి అవకాశం లేకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. నిరసన గళాలపై ఉక్కుపాదం మోపుతున్నది. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, విమర్శకులు, సామాజికవేత్తలు.. ఇలా ఎవరనేది తేడా లేకుండా అసమ్మతి గళాలను అణచివేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్‌ ఖాతాలు ఫ్రీజ్‌
బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఈ తీరుపై పలు సందర్భాలలో తన ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నది. చెల్లింపు వివాదం కారణంగా పార్టీ ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు స్తంభింపజేశారనీ, దాదాపు రూ.210 కోట్ల లాక్‌ చేశారని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ చర్య సంబంధిత ధోరణికి ఒక సూచిక మాత్రమేనని విశ్లేషకులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలకు స్థానమివ్వకుండా ప్రభుత్వం రహస్య నియంత్రణ అమలు చర్యలను సైతం ఉపయోగించిందనే ఆరోపణలున్నాయని వారు అంటున్నారు. ముఖ్యంగా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించేవారు గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటారని చెప్తున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు, చట్టాలే ఆయుధాలు
మోడీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ, సీబీఐలను తనకు అనుకూలంగా, ప్రత్యర్థులపై ఆయుధంగా వినియోగించుకుంటున్నదని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే, కొన్ని చట్టాలలోని నిబంధనలనూ అసమ్మతి వర్గాలపై మోడీ సర్కారు ప్రయోగిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద విదేశీ నిధులపై కఠినమైన పరిమితులతో సహా, భారతీయ పౌర సమాజ సంస్థలు గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొన్నాయని గుర్తు చేస్తున్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ కింద విచారణ కారణంగా తన కార్యకలాపాలను నిలిపివేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియాతో సహా, ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా నివేదించిన ప్రముఖ సంస్థలూ ఈ బాధను ఎదుర్కొన్నవే కావటం గమనార్హం. కేంద్రంలో మోడీ సర్కారు తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2020 మధ్యకాలంలో దాదాపు 19వేల ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సులు రద్దయినట్టు అంతర్జాతీయ న్యాయనిపుణుల కమిషన్‌ కనుగొన్నది.
జర్నలిస్టులు, విమర్శకులనూ వదలని వైనం
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులను సైతం మోడీ సర్కారు వదలటం లేదు. మోడీ హిందూ జాతీయవాద అజెండాపై అత్యంత తీవ్రమైన విమర్శకులలో ఒకరైన ప్రముఖ జర్నలిస్ట్‌ రాణా అయ్యూబ్‌. కోవిడ్‌-19 రిలీఫ్‌ ఫండ్‌ నుంచి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆమె చేసిన ఆరోపణలపై ఆమె సంవత్సరాల తరబడి మనీ-లాండరింగ్‌ దర్యాప్తుతో సహా అనేక దఫాలు చట్టపరమైన, చట్టవిరుద్ధమైన వేధింపులను ఎదుర్కొన్నారు. గతంలో విమర్శకుడు హర్ష్‌ మందర్‌, అతని ఇంటిపై దాడి చేసి, ఆయన లాభాపేక్ష రహిత సంస్థ మీద ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలపై దర్యాప్తు జరిగిన విషయాన్ని సైతం రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
సోషల్‌ మీడియా సంస్థలపై ఒత్లిళ్లు
ఎన్నికల సీజన్‌ మొదలవటంతో అభ్యర్థులు, పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల గురించి తెలుసుకోవటానికి కోట్లాది మంది పౌరులు ఇంటర్నెట్‌పై ఆధారపడతారు. కానీ భారత ప్రభుత్వం ఆన్‌లైన్‌ కంటెంట్‌పై ఆంక్షలు విధిస్తున్నది. ముఖ్యంగా, బీజేపీకి, మోడీకి, ఎన్డీయే ప్రభుత్వానికి, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్‌ ఉంటే.. వాటిని తొలగించాలంటూ సోషల్‌ మీడియా కంపెనీలపై సర్కారు బలవంతం చేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
మోడీ పాలనలో పౌరులు, మీడియా, రాజకీయ పార్టీల హక్కులు కాలరాస్తున్నారనీ, ప్రజాస్వామ్య దేశంలో ఈ విధానం ఏ మాత్రమూ మంచిది కాదని మేధావులు అంటున్నారు. ఎలాగైనా, మూడోసారి సైతం అధికారంలోకి రావాలనీ, 400కు పైగా ఎంపీ స్థానాలను సాధించాలనే క్రమంలో మోడీ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరించటం ఖండనార్హమని చెప్తున్నారు. గత ఐదేండ్ల నుంచి కేంద్రం ఇదే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నదనీ, దేశ ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాల ప్రజలు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కు అనే ఆయుధంతో సరైన సమాధానం చెప్పాలని మేథావులు, సామాజికవేత్తలు సూచిస్తున్నారు.