రామరాజ్యం కావాలంటే…

రామాయణం కథలోని రాముని వ్యక్తిత్వం, రాముని నడవడి నాజీవితానికి ఒక సరికొత్త వ్యక్తిత్వాన్ని, దృక్పథాన్ని నేర్పింది. నేను అచ్చం రామునిలా జీవించాలనే కోరిక కలిగించింది. నేను ఒకటవ,రెండోవ తరగతులు చదివే రోజుల్లోను, ముఖ్యంగా గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శించిన రోజుల్లో, కృష్ణలీలలు యక్షగానం ప్రదర్శించిన రోజుల్లో సైతం నన్ను బాలరామునిగా, బాలకృష్ణుడిగా ఇవ్వాలని మా అమ్మని అడిగి ఎత్తుకపోయి కౌసల్యగా, యశోదగా నటిస్తున్నవారు వేదికపై ఆడిస్తూ ఏవేవో పాటలు పడేవారు. నాకు ఏమి అర్థం కాకపోయేది. ఆ రోజుల్లో నా బాల్‌(క్రాప్‌ ) ఉంగరాల జుట్టు, నల్లని రూపు ఎలాంటి మేకప్‌ లేకుండానే అచ్చం బాలరామునిలా ఉన్నాడని సంబరంగా, సంతోషంగా చెప్పుకునేవారు. కానీ నాకు ఏమి అర్థంకాక మౌనంగా ఉండిపోయేవాన్ని మరి కొన్నిసార్లు తోటి పిల్లలతో ఆడుకోటానికి గయిఇండ్లోకి (బజార్లోకి) ఉరికి పిల్లలందరితో కలిసిమెలిసి ఆటలాడేవాన్ని. సాయంత్రం పూట పొద్దుగూట్లో పడేముందు అమ్మ నాకు అన్నం తినిపిస్తుంటే అమ్మలక్కలు జమయ్యి రాత్రి చూసిన రామాయణ కథని ముచ్చటించే వారు. ఆకుల బుచ్చమ్మ, ఆకుల అయిలక్క, గుండ అనుమవ్వ పెద్దమ్మ, అందరు నువ్వు రాముడివి కావాలనే వారు. రాముడు రాజు కొడుకుకదా దేవుని అవతారం కదా నేను దేవుణ్ణి ఎలా కాగలను అనేవాన్ని. వెంటనే అమ్మ దేవుడని కాదు, రామునిలా మంచి బాలుడివి కావాలి. తండ్రి మాట శిరసా వహించాలి పెద్దలమాట వినాలి, గౌరవించాలి. అబద్దమాడకూడదు.అడిగిన వారందరికి సాయం చేయాలంటూ రాముని లాగానే నీది కూడా ఒకేమాట, ఒకే బాట, ఒకే బాణం కావాలి.అచ్చం రామునిలా బతకాలన్న మాట. అలా అమ్మ చెప్పిన మాటలు చూసిన రామాయణ కథ బాగా మనస్సులో నాటు కొన్నాయి. రోజురోజుకూ పెరిగి పెద్దయినకొద్దీ శ్రీరామునితత్త్వం జీవిత సత్యం బాగా అలవడింది. ఆడ, మగ బేధాలు ఉండకూడదని ఇద్దరు సమానులనే భావం ఏర్పడింది. కుల, మత బేధాలు సమసి పోవాల ని భావించసాగాను. ఆ రామతత్వంతోనే నేను హుస్నా బాద్‌, సిద్దిపేట కాలేజీలలో చదివేరోజుల్లోను అమ్మాయిలని ఆటపట్టించే ఆకతాయి రౌడీలను ఎదిరించసాగాను. రామాయణం కథలోని రాముని వ్యక్తిత్వం, రాముని నడవడి నా జీవితానికి ఒక సరికొత్త వ్యక్తిత్వాన్ని, దృక్పథాన్ని నేర్పింది.నేను అచ్చం రామునిలా జీవించాలనే కోరిక కలిగించింది.తరువాత నేను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో లా పూర్తి చేసి వకాలత్‌ని తిరుగులేని రామబాణంగా మార్చి కరీంనగర్‌ కోర్ట్‌ రణభూమిలో వెయ్యి యుద్ధాలు చేసి కొన్ని వేల మందిని విజేతలని చేసాను.వందల మంది నిరుపేద రైతు కూలీలకు లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించాను. శివుడు, రాముడు. బీరప్ప, మడేలయ్య లాంటి దేవుళ్ళే దిక్కు లేని వారై దేవుళ్ళ భూములన్ని అక్రమార్కుల, రియల్టర్ల హస్తగతమైన ప్పుడు వకాలత్‌నే ఒక వజ్రాయుధంగా ఒక పశుపతా స్త్రంగా మార్చి విజయాన్ని అందించాను. (మరిన్ని వివ రాల కోసం కోర్ట్‌ రణభూమిలో వెయ్యి యుద్ధాలు- వెయ్యి విజయాలు పుస్తకం చదవండి ) రాముడికి గుడి నిర్మిస్తే రామరాజ్యం రాదు. రాముడికి పూజలు జరిపి నా రామరాజ్యం రాదు. అన్యాయంపై యుద్ధం ప్రకటిం చి సర్వేజన సుఖినోభవంతు అంటూ పోరాటంచేస్తే రామరాజ్యం వస్తుంది.యత్ర నార్యస్తు పూజ్యంతే రమ ంతే తత్ర దేవతాః అంటూ మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తే రామరాజ్యం సిద్ధిస్తుందని నా నమ్మకం.
 -గులాబీల మల్లారెడ్డి, 944004135