ఎన్నికల తర్వాత జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు

ఎన్నికల తర్వాత జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు– ఏడాదిలోగా ఇతర సమస్యల పరిష్కారం
– ఫెడరేషన్‌కు మంత్రి పొంగులేటి హామీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పార్లమెంటు ఎన్నికల తర్వాత జర్నలిస్టులకు ఇండ్లస్థలాల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ పూర్తయిన నెలరోజుల్లోనే ఇండ్లస్థలాల విషయమై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన మీడియా చిట్‌చాట్‌ సందర్భంగా తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి.రాంచందర్‌, కార్యదర్శి బి.రాజశేఖర్‌ తదితరులు మంత్రిని కలిశారు. జర్నలిస్టుల సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మంత్రికి వివరించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ఎన్నికలు పూర్తికాగానే ఇండ్లస్థలాలను ఇస్తామన్నారు. అలాగే హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్లు, ఇతర సమస్యలను ఏడాదిలోగా సెటిల్‌ చేస్తామన్నారు.