భూగర్భ జలాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

– బాలవికాస సేవా సంస్థ కోఆర్డినేటర్ కనకరాజు
నవతెలంగాణ – మిరు దొడ్డి 
ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాలవికాస సేవా సంస్థ కోఆర్డినేటర్ కనకరాజు అన్నారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులచే బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీటిని వృధా చేయడం ద్వారా రాబోయే రోజుల్లో దేశంలో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదన్నారు. దేశంలో నీటి సమస్య పరిష్కారానికి సంఘీభావంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య పరచడం కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. నీటి వృధాను అరికట్టాలని విద్యార్థులచే మానవహారం నిర్వహించడంతో పాటు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జగన్మోహన్ రెడ్డి, బాలవికాస ప్రతినిధులు మల్లేశం, రాజు పలువురు పాల్గొన్నారు.