– అగ్రదాతల్లో ఏడు సంస్థలు
– ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాషాయపార్టీకి వేల కోట్లు
– గత ఐదేండ్లలో భారీ మొత్తంలో సమకూర్చుకున్న కమలం పార్టీ
– ఒక్క రోజులోనే కోట్ల రూపాయలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం లోగుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎన్నికల సంఘం(ఈసీ)కు సమర్పించిన సమాచారంతో అసలు విషయాలు బహిర్గతమవు తున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని మిగతా పార్టీల కంటే భారీగానే విరాళాలు అందుకున్న బీజేపీకి గత ఐదేండ్లలో ఏడు సంస్థల నుంచి అధిక మొత్తంలో నిధులు అందాయి. ఇక కొన్ని సంస్థలు ఒక్క రోజులోనే (వేర్వేరు తేదీల్లో) రూ.100 కోట్ల కంటే పైగానే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి విరాళాలు అందించాయి. వీటిలో క్విక్ సప్లై చైన్, ఆదిత్య బిర్లా గ్రూప్, మెఘా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్)లు ఉన్నాయి.
క్విక్ సప్లై చైన్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి
బీజేపీ ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ విరాళాల జాబితా ప్రకారం.. 5 జనవరి, 2022న ఆ పార్టీ.. ముంబయిలో కొనుగోలు చేసిన రూ. 1 కోటి చొప్పున 200 బాండ్ల ద్వారా రూ. 200 కోట్ల విరాళాన్ని అందుకుంది. ఎలక్టోరల్ బాండ్‌లు అమలులోకి వచ్చిన ఆరేళ్లలో ఏ పార్టీకైనా ఒకే సంస్థ అందించిన అతిపెద్ద విరాళం ఇదే కావటం గమనార్హం. ముంబయికి చెందిన క్విక్ సప్లై చైన్ ప్రయివేట్ లిమిటెడ్, ఇది 5 జనవరి 2022న ఒక్కొక్కటి రూ. 1 కోటి విలువైన 225 బౌండ్‌లను కొనుగోలు చేసింది. బీజేపీ జాబితాలో ఇచ్చిన బాండ్ తేదీతో సమానంగా తేదీ ఉండటంతో, ఈ విరాళం రిలయన్స్-లింక్డ్ సంస్థ అయిన క్విక్ సప్లై చైన్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి వచ్చినట్టు స్పష్టమవుతున్నదని విశ్లేషకులు తెలిపారు
ఈ సంస్థ రెండోవసారి రూ.125 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను 11 నవంబర్ 2022న కొనుగోలు చేసింది. బీజేపీ రికార్డులు కూడా అదే రోజున అదే మొత్తంలో ముంబయి సంస్థ కొనుగోలు చేసిన బాండ్‌ను చూపుతుండటం గమనార్హం.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా
2023, ఏప్రిల్ 11న హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన రూ. 1 కోటి చొప్పున విలువ చేసే 115 బాండ్ల ద్వారా బీజేపీ రూ. 115 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకే రోజు రూ. 1 కోటి చొప్పున 140 బాండ్లను కొనుగోలు చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఆ రోజు ఏ ఇతర కంపెనీ కూడా ఆ పరిధికి దగ్గరగా బాండ్లను కొనుగోలు చేయలేదని స్పష్టమవుతున్నది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ బీజేపీకి ఇచ్చిన మరో మూడు విరాళాలు 6 ఏప్రిల్ 2021న రూ. 33 కోట్లు (ఏప్రిల్ 8న క్రెడిట్ అయింది), జనవరి 10, 2022న రూ. 40 కోట్లు (జనవరి 12న క్రెడిట్ అయింది), 12 డిసెంబర్ 2022న రూ.49 కోట్లు (డిసెంబర్ 16న క్రెడిట్ అయింది), 27 జనవరి 2023న రూ. 32 కోట్లు (జనవరి 31న క్రెడిట్ అయింది)గా ఉన్నాయి. మేఘా రెండో అత్యధిక ఎలక్టోరల్ బాండ్ల దాతగా ఉన్నది. 2019 నుంచి 2023 మధ్య రూ. 966 కోట్ల విలువైన బాండ్లను ఆ సంస్థ కొనుగోలు చేసింది.
ఫ్యూచర్ గేమింగ్ అండ్ హౌటల్ సర్వీసెస్ నుంచి
ఈ సంస్థ యొక్క ప్రధాన వ్యాపారం లాటరీ. దీనిని శాంటియాగో మార్టిన్ స్థాపించారు. రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లతో, ఎలక్టోరల్ బాండ్ల పద్ధతి ద్వారా రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు అందజేస్తున్నది. ఫ్యూచర్ గేమింగ్ ద్వారా రూ.500 కోట్లకు పైగా వచ్చినట్టు డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఆ సంస్థ బీజేపీకి కూడా విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
5 అక్టోబర్ 2021న చెన్నైలోని ఒక కంపెనీ నుండి రూ. 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌లను అందుకున్నట్టు బీజేపీ రికార్డులను చూస్తే తెలుస్తున్నది. ఆ రోజు రూ. 1 కోటి విలువ చేసే 50 లేదా అంతకంటే ఎక్కువ బాండ్లను కొనుగోలు చేసింది ఫ్యూచర్ గేమింగ్ మాత్రమే. దీంతో ఆ నిధులు బీజేపీ వెళ్లినట్టు తెలుస్తున్నది.
అదేవిధంగా 5 జనవరి, 2022న చెన్నైలో కొనుగోలు చేసిన బాండ్ల నుంచి రూ. 50 కోట్లను పొందినట్టు వెల్లడైంది. ఆ రోజు 50 లేదా అంతకంటే ఎక్కువ రూ. 1 కోటి విలువ గల బాండ్లను కొనుగోలు చేసిన చెన్నైకి చెందిన ఏకైక కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ కావటం గమనార్హం. వాస్తవానికి, కంపెనీ 100 బాండ్లను కొనుగోలు చేసింది. మిగిలిన విరాళాలు ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉన్నది.
డీఎల్‌ఎఫ్ నుంచి
బీజేపీ జాబితా ప్రకారం.. 7 ఏప్రిల్ 2022న, ఢిల్లీలో ఒక్కొక్కటి రూ. 1 కోటి చొప్పున 40 బాండ్లను కొనుగోలు చేసి ఆ పార్టీకి విరాళంగా అందించారు. ఆ రోజున బాండ్లను కొనుగోలు చేసింది ఢిల్లీ కేంద్రంగా పని చేసే రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ అని బాండ్ కొనుగోలుదారుల డేటాను చూస్తే అర్థమవుతున్నది.
మరికొన్ని ఇతర కంపెనీల ద్వారా
ఇక ఇదే జాబితాలో హల్దియా ఎనర్జీ లిమిటెడ్ కూడా ఉన్నది. 21 జనవరి 2023న, బీజేపీ.. కోల్‌కతాకు చెందిన ఒక సంస్థ నుంచి రూ. 45 కోట్ల రూపాయల విరాళాన్ని జాబితా చేసింది. బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల డేటాబేస్‌ను అధ్యయనం చేస్తే.. కోల్‌కతాకు చెందిన హాల్దియా ఎనర్జీ లిమిటెడ్ ఆ తేదీన ఒక్కొక్కటి రూ. 1 కోటి విలువైన 45 బాండ్లను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. 2019 నుంచి 2024 మధ్య మొత్తం రూ. 377 కోట్లను విరాళంగా అందించిన హల్దియా ఎనర్జీ లిమిటెడ్ మొత్తంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టాప్ 5 దాతలలో ఒకటిగా ఉన్నది.
గుజరాత్‌కు చెందిన టొరెంట్ పవర్ సంస్థ 7 జనవరి, 2022న, అహ్మదాబాద్‌లో ఒక్కొక్కటి రూ. 10 లక్షల చొప్పున 100 బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా రూ.10 కోట్లు పొందింది. ఈ మొత్తాన్ని బీజేపీకి విరాళంగా ఇచ్చినట్టు అర్థమవుతున్నది. టోరెంట్ గ్రూప్‌నకు ప్రధాని మోడీతో మంచి సంబంధాలున్నాయి. క్విక్ సప్లై చైన్ ప్రయివేట్ లిమిటెడ్ నుంచి రూ.200 కోట్ల మేర విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందినట్టు తెలుస్తున్నది.
ఆదిత్య బిర్లా గ్రూప్ ద్వారా
12 డిసెంబర్, 2022న ముంబయిలో కొనుగోలు చేసిన ఒక్కొక్కటి రూ. 1 కోటి చొప్పున 100 బాండ్ల ద్వారా బీజేపీ మరో పెద్ద సింగిల్ డే విరాళాన్ని పొందింది. ఆ రోజు బాండ్-కొనుగోలుదారుల డేటాబేస్‌ను పరిశీలిస్తే రూ. 1 కోటి విలువ చేసే 100 బాండ్లను ఒంటరిగా కొనుగోలు చేసిన కంపెనీ ఏదీ లేదు. అయితే, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అనేక సంస్థలు రూ. 100 కోట్లకు సమానమయ్యే రూ.1 కోటి బాండ్లను కొనుగోలు చేశాయి.