ఆరు రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్‌

Kejriwal to ED custody for six days– సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కేజ్రీవాల్‌
– 26న మోడీ నివాసం వద్ద ఆప్‌ ఘెరావ్‌
– తన జీవితం దేశానికే అంకితం అన్న కేజ్రీవాల్‌
– ఎన్నికల సంఘంతో ఇండియా ఫోరం నేతల భేటీ
– రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు
– ఈ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌
– ఇది రూ. 600 కోట్ల స్కామ్‌
– కేజ్రీవాల్‌కు అందినవి రూ. 300 కోట్లు : ఈడీ తరపున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వివరణ
– ఢిల్లీలో ఆప్‌ ఆందోళనలు… మంత్రుల అరెస్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు (ఈనెల 28 వరకు) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీకి రౌస్‌ ఎవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం వైద్య పరీక్షల అనంతరం కేజ్రీవాల్‌ను రౌస్‌ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్రపై ఈడీ కోర్టుకు వివరించింది. 28 పేజీల రిమాండ్‌ రిపోర్ట్‌ను ఈడీ కోర్టు ముందుంచింది. సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌ అని, మద్యం పాలసీ అమలులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టుకు వివరించారు. ‘ఇందులో సౌత్‌ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యవహరించారు. ఇది రూ.వంద కోట్ల స్కామ్‌ కాదు, రూ.600 కోట్ల స్కామ్‌. ఇందులో కేజ్రీవాల్‌కు రూ.300 కోట్లు అందాయి. ఈ డబ్బే పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఖర్చుపెట్టారు. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు పంపారు. ఆప్‌, సౌత్‌ గ్రూప్‌ల మధ్య విజరునాయర్‌ వారధిగా ఉన్నాడు. విజరు నాయర్‌ కంపెనీ నుంచి అన్ని ఆధారాలూ సేకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి’ అని ఈడీ వివరించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను పది రోజులు కస్టడీకి కోరింది.
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి 9:05 గంటలకు అరెస్టు చేశామని, 24 గంటల్లోపు ఆయనను కోర్టు ముందు హాజరుపరిచినట్లు ఈడీ పేర్కొంది. రిమాండ్‌ కోరుతూ దరఖాస్తు ఇచ్చామని, అన్ని నిబంధనలను పాటించి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశామని ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడించారు. కేజ్రీవాల్‌ అరెస్టుపై బంధువులకు కూడా సమాచారం అందించామని, అరెస్టుకు సంబంధించిన ఆధారాలను 28 పేజీల్లో రాతపూర్వకంగా అందజేశామని వివరించారు. అరెస్టు పంచనామా కూడా తమ వద్ద ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారుఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని పేర్కొంది. ఇక ఈ కేసులోనే అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ లభించలేదని న్యాయస్థానం దృష్టికి ఈడీ తీసుకెళ్లింది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ప్రస్తావించింది. రెండు పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించింది. సౌత్‌ గ్రూప్‌నకు లిక్కర్‌ పాలసీలో లబ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని తెలిపింది. లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్‌ కలిశారని, కలిసి పని చేద్దామంటూ కవితతో సీఎం కేజ్రీవాల్‌ చెప్పారని ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్‌ రికార్డ్స్‌ కూడా ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది.
తన జీవితం దేశానికే అంకితం: కేజ్రీవాల్‌
తన జీవితం దేశానికే అంకితమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయనను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌ కోర్టు లోపలికి వెళ్తూ.. ‘నా జీవితం దేశానికి అంకితం. లోపల ఉన్నా బయట ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటా’ అని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు కేజ్రీవాల్‌ పిటిషన్‌ను సీజేఐ ప్రత్యేక ధర్మాసనానికి కేటాయించారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అయితే ఇంతలోనే పిటిషన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉపసంహరించుకున్నారు. ఈ విచారణ ట్రయల్‌ కోర్టులో రిమాండ్‌ ప్రొసీడింగ్స్‌తో క్లాష్‌ అవుతుందని కేజ్రీవాల్‌ తరపు లాయర్లు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీని కారణంగా పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు. ట్రయల్‌ కోర్టు తీర్పునకు అనుగుణంగా మరో పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయిం చనున్నట్లు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిచ్చింది.
ఢిల్లీలో ఆందోళనలు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసాన్ని ఘెరావ్‌ చేయాలని పిలుపునిచ్చింది. అరెస్ట్‌ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఆప్‌ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో ఉదయం నుంచి రోడ్లపైకి వచ్చి కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా, బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఐటీవో కూడలి, డీడీయూ మార్గ్‌లోని ఆప్‌, బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. మంత్రులు అతిషీ, సౌరభ్‌తో సహా పలువురు కార్యకర్తలు, నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఐటీవో వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు తమను అదుపులోకి తీసుకున్నారని మంత్రి అతిషీ విమర్శించారు. ‘ఐటీవో వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా వీళ్లు తప్పుడు కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న వారిని కూడా అరెస్ట్‌ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం కాకపోతే.. మరేమిటి..?’ అని ఆమె పేర్కొన్నారు.మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలతో రాజధాని ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ నిరసనల నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యాలయం, ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే సెంట్రల్‌ ఢిల్లీలోని పలు రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలను నిషేధించారు. డీడీయూ మార్గ్‌కు వెళ్లే రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఐటీవో చౌక్‌, రాజ్‌ఘాట్‌, వికాస్‌ మార్గ్‌ల దగ్గర భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని ఐటీవో మెట్రో స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం వరకూ మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈసీకి ఇండియా ఫోరం నేతల ఫిర్యాదు
ఇండియా ఫోరం నేతలు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల సమయంలో కేంద్ర సంస్థల దుర్వినియోగంపై వినతి పత్రం సమర్పించారు. నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వినతిపత్రంలో 15 ఉదాహరణలతో వివరించారు. దీన్ని అరికట్టాలంటే ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను వినియోగించాలని కోరారు. ”వివిధ రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీ, హౌం సెక్రెటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులను నియంత్రించే, మార్చే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కానీ రాజకీయ ప్రతీకార ఆయుధాలుగా మారిన ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థల అధికారులను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రంలోని అధికార పార్టీ స్వేచ్ఛగా ఎన్నికలను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష నేతలను, ముఖ్య మంత్రులను ట్రాప్‌ చేసేందుకు కేంద్ర ఏజెన్సీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలపైనే వేటు పడింది. అధికార పార్టీకి చెందిన ఒక్క సభ్యుడిని కూడా అరెస్టు చేసేందుకు, విచారించేందుకు ఈ ఏజెన్సీలు సిద్ధంగా లేవు. రాజకీయ అవినీతితో కేంద్ర సంస్థలు పని చేస్తున్నాయి. ఎన్నికల ప్రకటన తరువాత ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ప్రచార సమయంలో ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ప్రతిపక్ష పార్టీల నేతలపై వేధింపులు ఆపాలి” అని నేతలు డిమాండ్‌ చేశారు. కక్ష సాధింపు చర్యల జాబితాను కూడా అందజేశారు. ఈసీని కలిసిన వారిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీఎంసీ నేత డెరిక్‌ ఓబ్రెయిన్‌, కాంగ్రెస్‌ నేతలు కెసి వేణుగోపాల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ తదితరులు ఉన్నారు.