– ఆర్పీఎస్ 2017 ఉండాలి
– ఆర్పీఎస్ 2013లోని ఎనామలీస్‌ను సరిచేయాలి
– కనీసవేతనం రూ.26వేలుగా నిర్ణయించాలి
– బేసిక్‌పై ఐదు శాతం ఇంక్రిమెంట్ రేట్‌ను నిర్ణయించాలి : ఆర్టీసీ ఎమ్‌డీకి ఎస్‌డబ్ల్యూఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేలా ఆర్పీఎస్ 2017ను రూపొందించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ కోరింది. 2013లోని ఎనామలీస్‌నూ సరిచేయాలని విన్నవించింది. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఉండేలా నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిస్థాయిలోనూ బేసిక్‌పై ఐదు శాతం ఇంక్రిమెంట్ రేట్‌ను నిర్ణయించాలని డిమాండ్ చేసింది. శుక్రవారం ఈ మేరకు ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌కు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌రావు వినతిపత్రం అందజేశారు. అందులో ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ.10,880 కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే మాస్టర్‌స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. ప్రతి స్థాయిలోనూ బేసిక్‌పై 5 శాతం ఇంక్రిమెంట్ రేటును నిర్ణయించాలన్నారు. ప్రతి మూడేండ్లకోసారి ఇంక్రిమెంట్లు మారేలా చూడాలని కోరారు. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని అని రకాల అలవెన్స్‌లను ఐదురెట్లు పెంచాలన్నారు. ఇంటి అద్దె అలవెన్స్ తగ్గింపు వలన ఆర్టీసీ కార్మికులకు జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ఫిట్‌మెంట్‌ను 30 శాతానికి పెంచాలని కోరారు.
ఆర్పీఎస్-2017 ఆరియ ర్స్‌ను ఎటువంటి వడ్డీ లేకుండా ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామన్న నిర్ణయం సరిగాదన్నారు. సుదీర్ఘకాలం సంస్థలో పనిచేస్తూ, మరో 15-20 ఏండ్ల తర్వాత రిటైరన్ అయ్యే వారికి ఆనాటికి పెరిగే ధరలు, ద్రవ్యోల్భణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ డబ్బులు అప్పుడు ఏ అవసరానికి ఉపయోగ పడవని తెలిపారు. ఆ నిర్ణయాన్ని మార్చి నాలుగేండ్ల లోపులోనే వడ్డీతో సహా చెల్లించాలని కోరారు. రిజిష్టర్డ్ ట్రేడ్ యూనియన్లతో చర్చించి, సర్వీసు కండిషన్లపై ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు విడుదల చేసిన డీఏలను జనవరి, జులై నెలల నుండి వర్తింపచేస్తూ, పేస్కేలు ఏరియర్స్ గణన చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకూ దీన్నే వర్తింపజేయాలన్నారు. స్టాగేషన్ ఇంక్రిమెంట్లను 12/20 స్థానంలో 6/12/18/24/30లను అమలు చేయాలని కోరారు. ఎస్‌ఆర్బీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వాల్సిన రూ.100 కోట్లను వెంటనే ఇవ్వాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించాలని కోరారు. పీఎఫ్, ఎస్‌ఆర్బీఎస్, ఎస్బీటీల ట్రస్ట్‌బోర్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సీసీఎస్ సంస్థ ప్రతినిధుల కోసం ఎన్నికలు నిర్వహించడానికి యాజమాన్యం అనుమతించాలనీ, సీసీఎస్‌కు చెల్లించాల్సిన రూ.1150 కోట్లను వెంటనే ఇచ్చి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి రావాల్సిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను చెల్లించాలనీ, లీవుల పొదుపుపై వున్న సీలింగ్‌ను ఎత్తేయాలని విన్నవించారు. రిటైర్మెంట్ సమయంలో 300 ఎర్డ్న్ లీవులు లేనివారికి వారి ఖాతాలో వున్న మెడికల్ /పర్సనల్ హాఫ్ పే లీవుల నుంచి తీసుకుని చెల్లించాలని కోరారు. రెగ్యులేషన్‌ను సవరించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బ్రీత్ ఎన్లైజర్స్ పరీక్షలో ఎం.వి.యాక్ట్ నిర్దేశిస్తున్న, పోలీసులు పాటిస్తున్న (30ఎం.జి. / 100 ఎంఎల్) ప్రమాణాన్ని ఆర్టీసీ పాటించి, కండీషన్లో లేని బ్రీత్ ఎనలైజర్స్‌తో వేధింపులు ఆపాలనీ, క్రొత్త బ్రీత్ ఎనలైజర్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం అమలు నేపథ్యంలో అన్ని సర్వీసులకు శాస్త్రీయ పద్ధతిలో రూటు సర్వే ద్వారా రన్నింగ్ టైము నిర్ణయించాలని కోరారు.