
– ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలి. జస్టిస్ కే శరత్.
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరిలోని జిల్లా కోర్టు ఆవరణలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ కే శరత్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనలు నూతనముగా నిర్మించబడిన బార్ అసోసియేషన్, ప్రత్యేకంగా నిర్మితమైన మహిళా బార్ అసోసియేషన్, దీవిస్ లాబోరేటరీస్ వారి సౌజన్యముతో ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయాన్ని శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించి ప్రజలకు సత్వర న్యాయ పరిష్కారం అందటములో ముఖ్య పాత్ర వహించాలని తెలిపారు. యాదగిరిగుట్టలో త్వరలోనే కోర్టు ప్రారంభించుకుందాం అని వివరించారు. భువనగిరి కోర్టు నూతన భవనము నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. జ్యుడిషియల్లో మహిళల సంఖ్య మరింత పెరగవలసి ఉందన్నారు. జూనియర్ న్యాయవాదులు ఆర్థిక అవసరాల కోసం ఇతర పనులకు వెళ్లవలసిన అవసరం లేకుండా వారికి పూర్తిస్థాయిలో సీనియర్ న్యాయవాదులు అందుబాటులో ఉండి వారికి సమయం కేటాయించాలని కోరారు. కేసుల సంఖ్యను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. దానికి న్యాయవాదులు వాయిదాలకు వెళ్లకుండా కోర్టులో వాదోపవాదాలు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు . చట్టాలొని సెక్షన్ల పట్ల పూర్తి అవగాహనతో పాటు సున్నితమైన పరిశీలన ఉండాలన్నారు .జస్టిస్ కె సుజనా మాట్లాడుతూ తను భువనగిరిలోనే ప్రాక్టీస్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేకంగా మహిళ బార్ అసోసియేషన్ భవనాన్ని తను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తులను పుష్పగుచ్చాలు శాలువాలతో సన్మానించారు. సాధన స్కూల్ విద్యార్థులు ప్రారంభోత్సవం, ముగింపుల గీతాలాపనలు చేశారు. భువనగిరి న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి సి. హెచ్. రాజశేఖర్ రెడ్డిలు న్యాయవాదుల సంక్షేమనికి పాటు పడుతున్నట్లు, జిల్లాలో మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించటానికి సహకారం అందచేయాలని తెలిపారు. కేశవరెడ్డి, యం. ఎ.రఫీ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.ఈ కార్యాక్రమములో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి . కవిత, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్, చౌటుప్పల్ న్యాయమూర్తి మహతి, ఆలేరు న్యాయమూర్తి సుమలత, పాల్గొన్నారు.