
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రైతులు పంటల సాగులో వైవిధ్యత, యాంత్రీకరణలో దృష్టి సారించి కూలీల కొరత, రాష్ట్రానికి అవసరమైన పంటల కొరత తగ్గించే దిశగా పంటలు సాగు చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామిరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధనా, విస్తరణ సలహా సంఘ రెండు రోజుల సమావేశా కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టరేట్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అనంతరం విస్తరణ సంచాలకులు డా.వి. సుధారాణి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ మండలం లో 25 శాతానికి పైచిలుకు రైతులు నేరుగా విశ్వవిద్యాలయం నుండి విస్తరణ సేవలను పొందుతున్నారని, అదేవిధంగా పరిశోధనలో నిరూపించబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు క్షేత్రస్థాయిలో అందించేందుకు ప్రదర్శనలను నిర్వహించి వాటి ఫలాలను రైతులు పొందే విధంగా రాబోయే కాలంలో విస్తరణ కార్యక్రమాలను రూపొందించాలని శాస్త్రవేత్తలను, విస్తరణ అధికారులను కోరారు. అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన వ్యవసాయ అధికారులు వారి జిల్లాల్లోని వ్యవసాయ స్థితిగతులు, ఎదుక్కోన్న సమస్యలు, చేపట్టిన కార్యక్రమాలాలు తదితర అంశాలను, దక్షిణ తెలంగాణ మండలంలో 2023-2024, 2024-25 సంవత్సరలలో చేపట్టిన, చేప్పవలసిన వివిధ పరిశోధన, విస్తరణ అంశాల పై రైతుల సమక్షంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, ఏరువాక కేంద్రం కో- ఆర్టినేటర్లు డా.భరత్ భూషణ్ రావు, అనిల్ కుమార్, లక్ష్మణ్, కె.వి.కె. పాలెం, కంపాసాగర్, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ప్రభాకర్ రెడ్డి, సుల్తాన్, శ్రీనివాస్, దక్షిణ తెలంగాణ మండల శాస్త్ర వేత్తలు, రైతులు, ఎన్జీవోలు, పరిశోధన విస్తరణ సలహా సంఘ సభ్యులు లావణ్య, రమణారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.