
బీఆర్ఎస్ కు చెందిన పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి పై అవిశ్వాసం నెగ్గింది. శనివారం తొర్రూరు ఆర్డీవో నర్సింగరావు అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. మొత్తం 9 మంది ఎంపీటీసీ లు ఉండగా, ఇటీవల ఆరుగురు ఎంపీటీసీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గతంలో వ్యక్తిగత కారణాల రీత్యా పెద్దవంగర ఎంపీటీసీ సభ్యుడు ఏదునూరి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ రాజేశ్వరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సభ్యులను పట్టించుకోవడం లేదనే కారణాలతో గత కొన్ని రోజులుగా ఎంపీపీ పై ఎంపీటీసీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 5 న అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సూరయ్య కు అందజేశారు. అవిశ్వాస పత్రాన్ని పరిశీలించిన అనంతరం అధికారులు అవిశ్వాసానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం అవిశ్వాస సమావేశం నిర్వహించారు. మొత్తం 8 మంది ఎంపీటీసీల్లో ఎంపీపీ రాజేశ్వరి తో పాటుగా, వడ్డెకొత్తపల్లి ఎంపీటీసీ సాయిని ఝాన్సీ గైర్హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యుల్లో వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన (అవుతాపురం), బానోత్ విజయ (పోచంపల్లి), ఈరెంటి అనురాధ (గంట్లకుంట), ఎర్ర సబిత (కొరిపల్లి), బానోత్ రవీందర్ నాయక్ (బొమ్మకల్లు), మెట్టు సౌజన్య (చిన్నవంగర) లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం తో ఎంపీపీ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్డీవో నర్సింగరావు మాట్లాడుతూ.. ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గడం తో పదవి కోల్పోయింది. అవిశ్వాస తీర్మాన పత్రాలను కలెక్టర్ కు అందజేస్తామని, త్వరలోనే కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీపీ ప్రక్రియ చేపడుతామని వెళ్ళడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, ఎంపీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.