– సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల పిలుపు : భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు నివాళి
నవతెలంగాణ – ముషీరాబాద్
భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లాంటి అమరవీరుల స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ టి.సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సభలు, సమావేశాల ద్వారా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వ్యవసాయరంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిజ్ఞ పూనాలని సూచించారు. రాష్ట్ర కన్వీనర్ పశ్య పద్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నదని, కుట్రపూరితంగా ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అరెస్టు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌కం టాక్స్, ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందని, కేంద్రానికి లొంగనివారిపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్లు మండల వెంకన్న, గౌని ఐలయ్య, జక్కుల వెంకటయ్య, నాగిరెడ్డి, బాలమల్లేశ్, ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్ రావు, మహిళా సంఘం నాయకులు సుజాత, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, గిరిజన సంఘాల నాయకులు శ్రీరాం నాయక్, అంజయ్య నాయక్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, ఎస్‌కేఎం నాయకులు గోపాల్, వృత్తి సంఘాల నాయకులు లెల్లెల బాలకృష్ణ, పి.ఆశయ్య, ఉడుత రవీందర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.