కోన సముందర్ సొసైటీ అవినీతిపై మంత్రికి ఫిర్యాదు

– టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్  యాదవ్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ సొసైటీలో రూ.కోటికి పైగా జరిగిన అవినీతిపై జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేయనున్నట్లు టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్  యాదవ్  అన్నారు. కోన సముందర్ సొసైటిలో గడిచిన బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాలలో వరి కొనుగోలు కమిషన్ రూ.60 లక్షలు వచ్చాయన్నారు.అదేవిధంగా ఫర్టిలైజర్, సీడ్ కమిషన్ ద్వారా నాలుగు సంవత్సరాలలో రూ.20 లక్షల కమిషన్ల రూపంలో సొసైటీ ఆదాయం వచ్చిందన్నారు.గ్రామ రైతులు విండో మహాజన సభలో సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డిని,  సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్ లను నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు. మాకు సంబంధం లేదు అంటూ  ఒకరికొకరు తప్పించుకుంటున్నారని ఆరోపించారు.  ఎవరికి వారు తప్పించుకుంటుంటే సొసైటీకి వచిన నిధులు ఎక్కడికి పోయాయని గ్రామ రైతు నాయకులు నిలదీయడం జరిగిందన్నారు. సొసైటీకి తాళం వేసే పరిస్థితికి రైతులు వచ్చారంటే కార్యదర్శి, చైర్మన్ ల అవినీతి బాగోతం ఏ స్థాయికి  వచ్చిందో స్పష్టంగా కనపడుతుందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకార సంఘాలను అవినీతి కుంపటిగా తయారు చేశారని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ బిఆర్ఎస్ నాయకులను కాపాడుతూ వచ్చారని ఆరోపించారు.గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అవినీతి వల్లే ఈరోజు సొసైటీలు నష్టాల్లో మునిగిపోయాయన్నారు.  బాల్కొండ నియోజకవర్గంలో సొసైటీల్లో అవినీతి మొక్కలను పెంచిoది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నని వేణుగోపాల్ యాదవ్ విమర్శించారు. అవినీతి పరులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టబోదని హెచ్చరించారు. కోన సముందర్ సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, నిధులు స్వాహా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకునేటట్లు ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్,కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పపడిగేల ప్రవీణ్, నాయకులు పాలెపు నరసయ్య, బుచ్చి మల్లయ్య యాదవ్, గంగారెడ్డి, ఉట్నూర్ ప్రదీప్, గోపి లింగారెడ్డి, జెడి శ్రీనివాస్, సుధాకర్, సతీష్, భూమారెడ్డి, సింగిరెడ్డి శేఖర్, కుందేటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.