యూనివర్సిటీని సందర్శించిన వైస్ ఛాన్సలర్ బి.వెంకటేశం..


నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు అనంతరం రాష్ట్రంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశంకు కీలకమైన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కాలేజీ విద్య కమిషనర్ గా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా, తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ తో పాటుగా ఇటీవల గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా సర్కారు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన అన్ని శాఖలలో కీలకమైన బాధ్యతలు నిర్విరామమముగా ఒకవైపు నిర్వహిస్తూనే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తూ రూసాకు రూ.10 కోట్ల నిధుల మంజూరు తోపాటుగా పలు అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీని ఆదివారం సందర్శించిన వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం వైస్ ఛాన్సలర్ గా నియామకమైన తరువాత మొదటిసారిగా యూనివర్సిటీకి రావడంతో తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.
అనంతర వైస్ ఛాన్సలర్ నివాసంలో ఆయనను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషినర్, అడిషనల్ కలెక్టర్, ఆర్. డి.ఓ. తదితర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ భూమి 70 ఎకరాలు కేసులో ఉన్నదని, 60 ఎకరాలు సారంగాపూర్ భూమికి హద్దులు లేవని రిజిస్ట్రార్ గుర్తుచేయగా ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని ఆయన కలెక్టర్ కు సూచించగా, కలెక్టర్ పరిష్కరానికి హామీ ఇచ్చారు. అన్ని బిల్డింగ్ లను సందర్శించిన వెంకటేశం యూనివర్సిటీ పరిసరాల మీద ఉన్న ఆసక్తితో బాలికల హాస్టల్ బిల్డింగ్స్ ను సైతం సందర్శించి రూసా ద్వారా విడుదలైన 7 కోట్లతో నూతన బాలికల బిల్డింగ్ కు ఎన్నికల కోడ్ అనంతరం నిర్మాణ పనులు మొదలు పెట్టాలని సూచించారు.
బాలికల కొరకు ఒక ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని రిజిస్ట్రార్ కు సూచించారు. అనంతరం బాలుర వసతి గృహం సందర్శించి విద్యారులతో ముఖాముఖీ సంభాషణ నిర్వహించారు. విద్యార్థులు తమ సమస్యల మీద అందించిన నివేదికను తీసుకొని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు.  రెండేండ్ల నుండి ట్యూషన్ ఫీ, మెస్ చార్జీలు బకాయిలు ఉన్నయని విద్యార్థులు తెలియజేయగా వెంటనే విడుదల చేయాలనీ కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.  ఆ తరువాత సెంట్రల్ లైబ్రరీని తనిఖీలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులతో కాంపిటేషన్ ఎగ్జామ్స్ లో మరియు గ్రూప్-1 గ్రూప్ -2, టెట్ లాంటి ఎగ్జామ్స్ కి పోటీపడి చదవాలని మీకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నామని విద్యార్థులకు వివరించారు.
నూతనంగా నిర్మిస్తున్న సైన్స్ కళాశాల బిల్డింగును కలియ తిరిగి పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న సైన్స్ కళాశాల బిల్డింగ్ లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండరాదని అధికారులను ఆదేశించారు. 2వ అంతస్తులో సెమినార్ హల్ కు అంచనా ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.  అనంతరం నూతనంగా ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించి విలువ అంచనా వేసి నివేదిక పంపించాలని రిజిస్ట్రార్ కు సూచించారు. 2014 లో నియామకమైన బోధన సిబ్బంది పదోన్నతులపట్ల గోవర్నమెంట్ ప్లీడర్ అభిప్రాయం కొరకు రిజిస్ట్రార్ ను లేఖ రాసి త్వరలో సానుకూలంగా పదోన్నతులు పూర్తిచేయాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందించిన నివేదికను తీసుకొని సమ్మె పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి 275 పోస్టులకు గాను 47 మాత్రమే మంజూరు అయ్యాయని, మిగిలినవి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పోస్టుల మంజూరు కు ప్రయత్నిస్తానని తెలిపారు.ప్రభుత్వ విద్యారంగం మీద ఉన్న ప్రేమతో విశ్వవిద్యాలయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని తపనతో నిరంతరం రిజిస్ట్రార్ యాదగిరి ద్వారా ఎప్పటికప్పుడు యూనివర్సిటీ లో జరిగే కార్యక్రమాల నివేదిక తెప్పించుకొని సరైన మార్గ నిర్దేశం చేస్తూన్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు పాల్గొన్నారు.