మాపై ఎందుకింత కక్ష..

మాపై ఎందుకింత కక్ష..– కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేయడం లేదు.: ‘సుప్రీం’ను ఆశ్రయించిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ‘రాష్ట్రానికి కరువు సహాయ నిధుల పంపిణీలో జాప్యంపై కేంద్ర ప్రభుత్వంపై ఈ పిటిషన్‌ దాఖలు చేశాం’ అని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రివర్గ బృందం నివేదిక సమర్పించి ఐదు నెలలు గడుస్తున్నా కేంద్రం నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతోందని.. దీంతో జనజీవనం అతలాకుతలమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువుగా ప్రకటించారని.. వీరిలో 196 ప్రాంతాలు తీవ్ర కరువు ప్రాంతంగా ప్రకటించినట్లు చెప్పారు. గత 30-40 ఏండ్లలో అత్యంత తీవ్రమైన పరిస్థితి ఉందని.. 48లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. నిధులు విడుదల చేయాలని కేంద్రానికి మూడుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదన్నారు. పిటిషన్‌లో ఖరీఫ్‌ 2023 సీజన్‌లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు కలిపి రూ.35,162 కోట్ల మేర నష్టం జరిగినట్టు పేర్కొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద కేంద్రం నుంచి రూ.18,171.44కోట్లు సహాయం చేయాలని కోరినట్టు తెలిపారు.నివేదిక వచ్చినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కేంద్రం నుంచి సహాయం పొందే అర్హత రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ నివేదిక అందిన నెలలోగా ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి రాష్ట్రానికి సహాయం అందించే విషయంలో కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాలని పిటిషన్‌ పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించిందని సిద్ధరామయ్య తెలిపారు. కరువుపై కేంద్రానికి మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లామని.. కానీ కేంద్రమంత్రులు ఎవరూ కలువలేదన్నారు. ఆ తర్వాత మళ్లీ కేంద్ర హౌంశాఖ మంత్రిని కలిసినా ఇంకా నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు.