అకాల వర్షం… తీరని నష్టం…

నవతెలంగాణ-మల్హర్‌రావు /గణపురం/కాటారం
అకాల వర్షాలు రైతులతో చెలగాటం అడుతున్నాయి. కోత కొచ్చిన పంటల ను చేతికందకుండా చేస్తున్నాయి. పొద్దంతా వాతావరణం మామూలుగానే ఉంటూ రాత్రి అయ్యే భారీ వడగండ్ల వాన కురుస్తోంది. సోమవారం అర్ధరాత్రి అకాల వర్షంతో మండలంలోని కొయ్యుర్‌, రుద్రారం,కొండంపేట,ఎడ్లపల్లి, తాడి చెర్ల, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లో వరి, మామిడి,మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి పోసిన ధాన్యం కుప్పలు, అరబోసిన మిర్చి తడిసి ముద్దయ్యాయి. పొలాల్లో కోతకు వచ్చిన వరి గింజలు రాలడమే కాక పొలాలు నెలవాలాయి. మామిడి కాయలు రాలాయి. వరద తాకిడికి మిర్చి, వరి ధాన్యం కొట్టుకపోయాయి గాలి బీభత్సంతో ఇంటి గోడలు కూలిపోయి, రేకుల ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్డుకు అడ్డంగా వక్షాలు విరిగి రాకపోకలు నిలిచిపోయాయి. కరెంట్‌ స్తంభాలు నెలకొరగడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. సరిగ్గా రెండు వారాల క్రితం ఇలాగే భారీ గాలివాన కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బ నుంచి కొలుకోకముందే మళ్ళీ గాలివాన బీభత్సం సష్టించడతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది రైతుల పరిస్థితి. ఎక్కువగా పెద్దతూండ్ల, అడ్వాలపల్లి, గాదంపల్లి గ్రామాల్లో మిర్చి,వరి ధాన్యం పంటలు చేతికొచ్చే సమయంలో తడిసి వరదల్లో కొట్టుకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరైయ్యారు. ఆర్థికంగా పంటలు నష్టపోయిన రైతులను, ఇంటి పైకప్పులు ధ్వంసమై నష్టపోయిన ఇంటి బాధితులను ప్రభుత్వం సంబంధించిన అధికారులతో సర్వేలు నిర్వహించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గణపురం మండలంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మండలంలో దాదాపు 15 నుండి 20 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కాంటాలు పెట్టినప్పటికీ లారీలు రాకపోవడంతో ధాన్యం భారీగా నిల్వలు ఉండిపోయాయి. దీంతో గాలి దుమారంతో భారీ వర్షం కురిడంతో రైతులు ధాన్యం మీద కవర్లు కప్పేందుకు పరుగులు తీశారు. అయినప్పటికీ ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిలిచి ఉండడంతో ధాన్యం మొత్తం నీళ్లలో తేలి ఉన్నాయి. ధాన్యం కాంటాలు అయినప్పటికీ లారీలు రాకపోవడంతో తమ ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు బోరుమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తరలించకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద భారీ నిల్వలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. ధాన్యం కాంటా అయిన తర్వాత తమ బాధ్యత లేనప్పటికీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ధాన్యం మిల్లులోకి పోయే వరకు రైతులదే బాధ్యతని చెపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం కురిసిన కాల వర్షంతో కాటారం మండలంలోని కొనుగోలు కేంద్రాలలో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక టార్పిలిన్‌ కవర్‌, చదును చేయబడ్డ భూమి లేక అరిగోస పడుతున్నారు. అన్నదాతలు మిల్లర్ల సమస్య, కొనుగోలు కేంద్రాలు నత్తనడక తూకం లాంటి సమస్యలతో కల్లాల్లో పోసిన ధాన్యం తూకం వేయక రైతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.