– పార్టీవారిని మార్చి.. వలసనేతలకు టిక్కెట్లు
– శ్రేణులను కలవరపెడుతున్న బీజేపీ ఐదో లిస్టు
– సినీ నటులు, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్ద పీట
– సొంత పార్టీ నాయకుల్లో ఆవేదన
– మోడీ, షా, నడ్డాలపై అసంతృప్తి
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 111 మంది అభ్యర్థులతో కూడిన ఈ లిస్ట్‌లో పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎంపీలకు స్థానం దక్కలేదు. ఈ జాబితాలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, నటులు, మాజీ కాంగ్రెస్ కీలక నాయకులేగాక.. అసలు పార్టీలో లేని వారికి సైతం టికెట్లు వచ్చాయి. కేంద్ర మంత్రులు అశ్విని కుమార్ చౌబె, వి.కె సింగ్, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ వంటి కీలక నాయకులు చోటు దక్కనివారిలో ఉన్నారు. సినీ నటులు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ వంటి వారికి బీజేపీ ఈ సారి స్థానం కలిపించటం గమనార్హం.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన పలువురు కీలక నాయకులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే బీజేపీ ఐదో జాబితాలో చోటు దక్కింది. ఐదో జాబితాలో చోటు దక్కని 37 మంది సిట్టింగ్ ఎంపీలలో యూపీ నుంచి తొమ్మిది, గుజరాత్ నుంచి ఐదు, ఒడిశా నుంచి నాలుగు, బీహార్, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. కర్నాటక నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన వివాదాస్పద నాయకుడు అనంత కుమార్ హెగ్డేకు ఈ సారి బీజేపీ అవకాశం కల్పించలేదు. భారత రాజ్యాంగంపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం విదితమే. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి కాషాయ అధిష్టానం టిక్కెట్లు కేటాయించటం గమనార్హం. ఇందులో సీతా సొరెన్, తపస్ రారు, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న నవీన్ జిందాల్‌కు కురుక్షేత్ర సీటు, జితిన్ ప్రసాదాకు పిలిభిత్ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్ర.. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేయనున్నారు.
వరుణ్‌గాంధీ ఔట్.. మేనకా గాంధీ ఇన్
ఇక తన వ్యాఖ్యలతో మతవిద్వేషాలు రెచ్చగొట్టే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఈ జాబితాలో బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఆయన మళ్లీ బెగుసరారు నుంచి బరిలో నిలవనున్నారు. కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్.. పాట్నా సాహిబ్ నుంచి పోటీలో ఉండనున్నారు. బీజేపీపై ఇటీవల పలు సందర్భాల్లో నిరసన గళం వినిపించిన పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. వరుణ్ తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తిరిగి సుల్తాన్‌పూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
యూపీలోని ఘజియాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన వి.కె సింగ్ స్థానంలో అతుల్ గార్గ్‌కు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు సైతం కమలం పార్టీ పోటీకి అవకాశం కల్పించింది. ఆమె తన సొంత నియోజకవర్గమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నుంచి బరిలో నిలవనున్నారు. కంగనా బీజేపీలో చేరక ముందే ఆ పార్టీ ఆమెకు టికెట్‌ను కేటాయించటం గమనార్హం. 1980 దశకం చివరలో ప్రసారమైన రామాయణం టీవీ సీరియల్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఈయన 2021లో బీజేపీలో చేరారు.
జార్ఖండ్‌లోని అధికార కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను వీడిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సమీప బంధువు సీతా సొరెన్ కొన్ని రోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఆమె డుమ్కా లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉండనున్నారు.
2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు జగదీశ్ షెట్టర్‌కు బెలగావ్ సీటును కేటాయించింది. కాంగ్రెస్‌లో తొమ్మిది నెలల ప్రయాణం అనంతరం ఈ ఏడాది జనవరి 25న జగదీశ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరకముందు వరకు కూడా ఆయన బీజేపీలోనే ఉన్నారు. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యారు పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ స్థానం నుంచి అదృష్టాని పరీక్షించుకోనున్నారు..
కొత్తవారికి టికెట్ల కేటాయింపు బీజేపీలో చిచ్చురేపుతున్నది. తమను కాదని ఇలా పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి టికెట్లను కేటాయించటం పట్ల పలువురు బీజేపీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని పని చేసిన తమని కాదని వలసనేతలను పోటీలోకి దింపటం తమను అవమానించటమేనని ఆ పార్టీ కార్యకర్తలతో పాటు టికెట్ దక్కని నేత మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ, షా, నడ్డా ల నియంతృత్వ వైఖరి పార్టీకి చేటు కలిగిస్తుందని ఆరోపిస్తున్నారు.