లాస్య హత్య నిందితులను.. వెంటనే శిక్షించాలి

లాస్య హత్య నిందితులను.. వెంటనే శిక్షించాలి– ఐద్వా నిజామాబాద్‌ జిల్లా కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ-ఆర్మూర్‌
లాస్యపై లైంగికదాడి చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఐద్వా నాయకులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన లాస్య కుటుంబాన్ని సోమవారం నిజామాబాద్‌ జిల్లా ఐద్వా నాయకులు పరామర్శించారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. హత్య చేసిన నిందితుడు.. హత్య జరిగి మూడు రోజుల్లో అవుతున్నా ఇప్పటివరకు నిందితుల ఆచూకీ దొరకకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తన ఐ ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించిన చాకును ఘటనా స్ధలంలోనే వదిలినప్పటికీ ఇప్పటికీ నిందితుడిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు.
లాస్యకు ఎనిమిది నెలల పాప కూడా ఉందని, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. మహిళలకు ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి నేటి ఆధునిక సమాజంలో ఉందని, ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ అవి కొంతమందికి చుట్టాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులకు గుణపాఠం చెప్పే విధంగా పోలీస్‌ వ్యవస్థ ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను అదుపులో తీసుకొని లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేపడతామని స్పష్టంచేశారు. పరామర్శించిన వారిలో పట్టణ అధ్యక్షురాలు అరుణ జ్యోతి, స్వప్న తదితరులు ఉన్నారు.