– ఎస్‌పీ గ్రూప్ నుంచి గోపాల్‌పూర్ పోర్టు స్వాధీనం
– రూ.3,350 కోట్లకు కొనుగోలు
– దేశవ్యాప్తంగా 13 పోర్టుల్లో అదానీ గ్రూప్ వాటా 24 శాతం
న్యూఢిల్లీ : నౌకాశ్రయాల్లో గౌతం అదానీ ఏకచత్రాధిపత్యం మరింత పెరిగిపోయింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ తాజాగా ఒడిషాలోని షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌నకు చెందిన గోపాల్‌పూర్ నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే దేశంలో పశ్చిమ, తూర్పులోని దాదాపు 12 పోర్టులు, టెర్మినల్స్‌ను సొంతం చేసుకున్న అదానీ పోర్టుపోలియోలో మరొక్కటి చేరినట్లయ్యింది. మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ సహజ వనరులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల స్వాధీనాలను భారీగా పెంచుకున్న విషయం తెలిసిందే. ఒడిషా గోపాల్‌పూర్ పోర్టును రూ.3,350 కోట్లకు అదానీకి విక్రయించినట్టు ఎస్‌పీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. కాగా.. ఇందులోని ఎస్‌పీ గ్రూపునకు చెందిన 56 శాతం వాటాను, 39 శాతం స్టెవెడొరెస్ నుంచి అదానీ పోర్ట్స్ స్వాధీనం చేసుకుంది. ఒడిషాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్‌పీ గ్రూప్ 2017లో కొనుగోలు చేసింది.
గోపాల్‌పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్ ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పోర్టులోని 95 శాతం వాటాను స్వాధీనం చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో భారీ రాబడి ఉంటుందని అదానీ పోర్ట్స్ అంచనా వేస్తోంది. రుణాలను తగ్గించుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి తమకు ఈ నిధులు సహకరించనున్నాయని ఎస్‌పీ గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. తద్వారా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తమ కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు. 2021లో నౌకాశ్రయాల రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూపు అనతి కాలంలోనే దేశంలోని అత్యంత కీలకమైన ముంద్రాపోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకల్ పోర్టు, హజీరా పోర్టు, ధామ్రా పోర్టు తదితర పోర్టులను స్వాధీనం చేసుకుంది. దేశంలోని మొత్తం నౌకాశ్రయ వ్యాపారంలో అదానీ 13 పోర్టులతో 24 శాతం వాటాను హస్తగతం చేసుకున్నారు.