శాన్‌ఫ్రాన్సిస్కో: నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్ డానియల్ కాహ్నెమన్ (90) బుధవారం మరణించారు. ఇజ్రాయెల్ మూలాలున్న ఆయన.. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేశారు. ఆయన పలు యూనివర్శిటీల్లో అధ్యాపక, పరిశోధన బాధ్యతలు నిర్వర్తించారు. డానియెల్ కాహ్నేమాన్, ఆయన సహచరుడు అమోస్ ట్వర్స్కీలు ఆర్థిక శాస్త్ర రంగాన్ని పునర్‌నిర్మించారు. మనుషులు ‘హేతుబద్ధ నటులు’ అని, ఏ కారు కొనాలి, ఏ ఉద్యోగం ఎంపిక చేసుకోవాలని వంటి విషయాల్లో ఎంపికను స్పష్టంగా అంచనా వేయగలరని వివరించారు. వీరు 2011లో విడుదల చేసిన పరిశోధనా పుస్తకం ”థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో” అత్యథికంగా అమ్ముడైంది. కాహ్నేమాన్‌కు 2002లో నోబెల్ బహుమతి లభించింది. అనిశ్చిత పరిస్థితుల్లో మనుషులు తీసుకునే నిర్ణయాల తీరును ఆర్థికశాస్త్రంతో అనుసంధానం చేస్తూ ఆయన చేసిన పరిశోధనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. మనిషి నిర్ణయాలు తార్కికంగా ఉంటాయని ఎకనమిక్ థియరీ భావిస్తే, అనిశ్చిత పరిస్థితుల్లో మాత్రం మనుషులు ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తారని ఆయన తన పరిశోధనలతో రుజువు చేశారు.