
అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులకు తాళలేక మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగులపాటి అన్నారంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పిండిపోలు అయోధ్య తన కూతురు చందనకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆనందం వేణుతో గత మూడు సంవత్సరముల క్రితం వివాహం జరిగింది. కాగా వేణు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. మొదట్లో సజావుగానే సాగిన వీరి కాపురంలో అదనపు కట్నం ఆశ చిచ్చు పెట్టింది. దాంతో సంవత్సరం క్రితం మృతురాలి అత్త విజయలక్ష్మి ,భర్త వేణు అదనపు కట్నం వేదింపులకు తట్టుకోలేక భర్తపై అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చందన తన తల్లితండ్రుల వద్ద జీవనం గడుపుతుంది. అయితే కొంతకాలంగా తనపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని, అదనపు కట్నం ఇవ్వాలని అన్నారం గ్రామానికి వచ్చి బెదిరిస్తుండడంతో మనస్థాపం చెందిన చందన ఉరి వేసుకుని మృతి చెందింది. కాగా మృతదేహాన్ని, సంఘటన స్థలాన్ని సూర్యాపేట డిఎస్పి రవి, సీఐ సురేందర్ రెడ్డి, తహాసిల్దార్ మందడి మహేందర్ రెడ్డి పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు, మృతురాలి తండ్రి అయోధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలికి 18 నెలల కుమారుడు ఉన్నాడు.