– కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు
– జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది
– వాల్మీకి, బోయలను ఆదుకుంటాం
– ఎన్నికల తర్వాత సంపత్‌కు మంచి పదవి
– భారీ మెజార్టీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలవబోతున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారనీ, అలా చేసిన వారు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తగిన ఫలితం ఉంటుందని హెచ్చరించారు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతుందనీ, తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఆనాడే తాము అధికారులకు చెప్పినా వినలేదన్నారు. ఇవాళ జైలుకు వెళ్తే.. అటు వైపు బీఆర్‌ఎస్ నేెతలెవరూ చూడటం లేదన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డితో కలిసి
శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం విలేకర్లతో మాట్లాడారు. తనకు ఓటు విలువ తెలుసునన్నారు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదనీ, తనను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ ఏకమయ్యాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు డీకే అరుణ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమె జాతీయ హోదా తీసురావచ్చు కదా? అని ప్రశ్నించారు. కానీ, పార్టీలో మాత్రం జాతీయ పదవి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత సంపత్‌కు కాంగ్రెస్‌లో మంచి పదవి వస్తుందని భరోసా ఇచ్చారు. వాల్మీకి, బోయలను ఆదుకునే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. గద్వాల్, అలంపూర్ ప్రాంతంలోని బోయల గురించి తనకు తెలుసని చెప్పారు. ఇప్పుడు వారందరూ ఒకవైపు రావాలని కోరారు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా వాటి పరిష్కారం కోసం పని చేస్తానని భరోసా ఇచ్చారు.
దేశానికే తెలంగాణ మోడల్
– జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం
– తుక్కుగూడ సభపై ఫోకస్
– ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్
ఏప్రిల్ ఆరున రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభపై ఫోకస్ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించేలా ఆ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. ఈ సభా వేదికపై ఐదు గ్యారంటీలను అగ్రనేతలు ప్రకటించబోతున్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (పీఈసీ)సమావేశంలో సీఎం మాట్లాడారు.
పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మ్యానిఫెస్టో కమిటీకి సలహాలు ఇవ్వాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను నియమించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టోలోని ఐదు న్యారు గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతంగా చేయాలన్నారు. కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులను మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు.
దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుందని జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రజల్లో మంచి స్పందన ఉందని నేతలకు వివరించారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటెడ్ పోస్టుల్లో పదవులు పొందిన వారిని అభినందిస్తూ తీర్మానం చేశారు.
వంద రోజుల పాలనపై ప్రజల్లో మంచి స్పందన : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
వంద రోజుల పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వందరోజుల పాలన పట్ల ప్రజల్లో ఉన్న స్పందనను ప్రచారంలో వాడుకోవాలని సూచించారు. రైతు బంధు ఇవ్వలేదంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉందన్నారు. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు