– క్యాంపెన్ ప్రారంభించిన కేజ్రీవాల్ సతీమణి
– వాట్సాప్ నెంబర్ కు విషెస్ పంపాలని సునీత విజ్ఞప్తి
న్యూఢిలీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ వాట్సాప్ క్యాంపెన్ కు ప్రారంభించారు. అక్రమ కేసులో జైళ్లో ఉన్న తన భార్త, ఢిల్లీ సిఎంకు ప్రజలు తమ ఆశీర్వాదాలు పంపాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం సుమారు 3:30 నిమిషాల వీడియోను సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. దేశంలోని అత్యంత నియంతృత్వ, అవినీతి శక్తులతో తన భర్త పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటంలో కేజ్రీవాల్ కు అండగా నిలవాలని కోరారు. అందుకోసం 8297324624 నెంబర్ కు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపాలని కోరారు. శుక్రవారం నుంచే ‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’ క్యాంపెన్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆశీర్వాదం, మద్దతు, అభినందనలే కాకుండా… ఇతర ఏ సందేశాలనైనా ఈ వాట్సాప్ నెంబర్ కు పంపవచ్చని తెలిపారు. ‘అవినీతి పరులపై పోరాడేందుకు మద్దతు కావాలని కేజ్రీవాల్ కోర్టులో చెప్పారు. ‘గత 30 ఏళ్లుగా కేజ్రీవాల్ తో కలిసి జీవిస్తున్నాను. నాభర్త రోమ రోమానా దేశభక్తి ఉంది. దేశంలోని బలమైన నియంతృత్వ, అవినీతి పరులతో ఆయన పోరాడుతున్నారు. ఆయనకు మీ మద్దతు తెలపండి ‘ అని వీడియో సందేశంలో ప్రజలను కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిఎం కేజ్రీవాల్ ను ఈ నెల 21 ఇడి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఇడి కస్టడీలో ఉన్నారు.