డీఎంహెచ్‌వో తీరుతోనే ‘దగా’ఖానాలు..!

'Daga' Khanalas in the same manner as DMHO..!– కాసుల కక్కుర్తితో ప్రయివేటు ఆస్పత్రులపై పర్యవేక్షణా లోపం
– అమలుకాని క్లీనికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-2010
– అవుట్‌వార్డుతో సంబంధం లేకుండానే అనుమతులు
– నాలుగైదేండ్ల్లుగా పెండింగ్‌లో లేకుండా హాస్పిటల్స్‌కు పర్మిషన్‌
– సౌకర్యాలు చూడకుండానే క్రమబద్ధీకరణ, రెన్యూవల్‌
– ఇతర శాఖలకు ఫిర్యాదులంది.. స్పందిస్తేనే డీఎంహెచ్‌వో తనిఖీలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం
ఖమ్మం జిల్లాలో ప్రయివేటు ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో శాఖలోని ఏ ఒక్క అధికారి ఆమెకు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. ది క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌-2010 నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రయివేటు ఆస్పత్రులకు అనుమతులివ్వాల్సి ఉండగా.. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా జిల్లాలో ఆస్పత్రులకు అనుమతులిస్తుండటంతోనే ప్రయివేటు వైద్యం గాడితప్పుతోందనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్లు కూడా లేకుండా నడిచే ఆస్పత్రులు బయటపడుతున్నాయి. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడో.. లేక ఇతరశాఖల అధికారులకు ఫిర్యాదులు అందినప్పుడో డీఎంహెచ్‌వో స్పందిస్తున్నారు తప్ప రెగ్యులర్‌ తనిఖీలు ఉండటం లేదు. ఒకవేళ రైడింగ్‌ చేసినా కుమ్మక్కైన కొన్ని ఆస్పత్రుల జోలికి వెళ్లట్లేదు.
అడ్డగోలు అనుమతులు..
తాజాగా గురువారం రాత్రి రైడింగ్‌ చేసి సీజ్‌ చేసిన సుగుణ హాస్పిటల్‌ అనుమతుల విషయంలోనూ డీఎంహెచ్‌వో మాలతి చేతివాటం చూపారనే ఆరోపణలున్నాయి. అందుకే ఆమె ఇంటికి వెళ్లే దారిలోనే ఉన్నా ఈ హాస్పిటల్‌ వైపు ఏనాడూ కన్నెత్తి చూడలేదని అంటున్నారు. గురువారం రాత్రి హాస్పిటల్‌లో 18 వారాలు, రెండు వారాలు నిండిన ఇద్దరు గర్భిణులకు అబార్షన్‌ చేసేందుకు సిద్ధమవుతుండగా పక్కా సమాచారంతో అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ యువరాజ్‌, ట్రైనీ ఐపీఎస్‌ మౌనికతో కలిసి అనివార్యంగా డీఎంహెచ్‌వో రైడ్‌ చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా హాస్పిటల్‌ నిర్వాహకులను పట్టుకున్నారు. హాస్పిటల్‌ నిర్వాహకుల వద్ద నెలలు నిండని 50 మంది మహిళల కేసు షీట్లు లభించటం వైద్యారోగ్యశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. అబార్షన్‌ చేయించుకునే మహిళల వివరాలు ఐపీ, ఓపీలో నమోదు చేయలేదు. ప్రతి కేస్‌ షీట్‌కు కోడ్‌లు వేసి ఉన్నాయి. కోదాడ, హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట తదితర జిల్లాల నుంచి మహిళలు వచ్చి ఖమ్మంలో అబార్షన్‌ చేయించుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పత్రికల్లో వార్తలో.. ఫిర్యాదులు వస్తేనో..
ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాలతి గత నాలుగేండ్లుగా పాల్పడుతున్న అవినీతి వ్యవహారాలపై పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయూస్‌ యూనియన్‌ టీఎస్‌ (పీహెచ్‌ఎంఈయూ) ఖమ్మం జిల్లా కమిటీ అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు చేసింది. ‘నవతెలంగాణ’ దినపత్రికలో వైద్యారోగ్యశాఖలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. డీఎంహెచ్‌వో మాలతి సెలవుల నుంచి వచ్చిన రెండో రోజు ఈనెల 20వ తేదీన ప్రయివేటు హాస్పిటల్‌ అనుమతులు (ఇన్‌వార్డు- అవుట్‌వార్డు) వివరాలు ఇవ్వాల్సిందిగా ‘నవతెలంగాణ’ దరఖాస్తు చేసింది. ఆ తర్వాత కూడా డీఎంహెచ్‌వో తీరుపై వరుస కథనాలు వస్తుండటంతో సమాచారానికి ముందు కొంత హడావుడి మొదలు పెట్టారు. ఇతర ప్రభుత్వశాఖల అధికారులకు నేరుగా ఫిర్యాదులందడంతో వారు స్పందించడంతో అనివార్యంగా వైద్యఆరోగ్యశాఖ అధికారి కదలాల్సి వచ్చింది. రెండు రోజులు రైడ్‌ చేసి నాలుగు హాస్పిటల్స్‌ను సీజ్‌ చేశారు. శుభ్రత లేదు, సరిపడా సిబ్బంది లేరనే కారణంతో తులసి డెంటల్‌ హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. అనమతి లేకుండా అనేక ఏండ్లుగా నిర్వహిస్తున్న పాజిటివ్‌ హౌమియోపతిని మూసివేశారు. గడువు తీరిన మెడిసిన్స్‌, హెవీ డ్రగ్స్‌ వినియోగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆదర్శ హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. అబార్షన్స్‌ విషయంలో సుగుణ హాస్పిటల్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇలా ఫిర్యాదులు వస్తేనో.. పత్రికల్లో కథనాలు వస్తే తప్ప వైద్యారోగ్యశాఖ అధికారి స్పందించే పరిస్థితి లేకపోవడం గమనార్హం.
డీఎంహెచ్‌వో ఏకపక్ష తీరు..!
జిల్లా వైద్యారోగ్యశాఖ గాడి తప్పడానికి డీఎంహెచ్‌వో ఏకపక్ష తీరే కారణమనే విమర్శలున్నాయి. తన శాఖలోని వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన ఆమె శాఖ ఉద్యోగులు కొందర్ని ఏజెంట్లుగా నియమించుకొని ప్రయివేటు హాస్పిటల్స్‌, ఇతర వ్యవహారాలకు సంబంధించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2019 డిసెంబర్‌లో మాలతి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు తీసుకున్నారు. నాటి నుంచి వందల ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారు. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇన్‌వార్డు, ఔట్‌వార్డు రిజిస్టర్‌ నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఐదేండ్లకోసారి ప్రయివేటు హాస్పిటల్స్‌కు అనుమతులను పునరుద్ధరించాల్సి ఉంటుంది. హాస్పిటల్‌ పర్యవేక్షణ చేశాకే రెన్యువల్‌ చేయాలి. కానీ ఇక్కడ అలాంటివేవీ పాటించట్లేదనే ప్రచారం ఉంది. ఖమ్మం జిల్లాలో 85 డయాగస్టిక్‌ సెంటర్స్‌, 300 హాస్పిటల్స్‌, వీటిలో 60 గైనిక్‌ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో అనేక సమస్యలున్నా.. సౌకర్యాల లేమి వెంటాడుతున్నా ఏ ఒక్క హాస్పిటల్‌ అనుమతిని పెండింగ్‌లో పెట్టకుండా రూ.2 లక్షలు ముడుపులు తీసుకుని ఇస్తుంటారనే ప్రచారం డీఎంహెచ్‌వోపై ఉంది. వసూళ్లకు ఒప్పుకోని అధికారుల స్థాయిని విస్మరించి బదిలీ చేసిన ఉదంతాలు సైతం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. ఇన్ని ఆరోపణలున్నా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌ నుంచి ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సీఎంవోకు సైతం ఫిర్యాదు వెళ్లినట్టు సమాచారం.