మనకు తెలీదు…

We don't know...ఓ ఊరు, ఆ ఊళ్లో అనేకం తోటలున్నాయి. అనేకం తోటలున్న ఆ ఊళ్లో తోటరాముడు అనే పేర చలామణి అవుతున్న మనిషి ఒకడుండేవాడు. వాడి పేరులో తోట వున్నది కాని ఊళ్లో వుండే ఏ ఒక్క తోటా వాడిది కాదు. వాడి తాతల కాలంలో ఎవరికైనా తోట అనేది వుండి వుండడం వల్ల వాడికాపేరు వచ్చిందేమో మనకు తెలీదు.
తోట లేకపోతే మునిగిపోయిందేమీ లేదు కానీ కావల్సినన్ని వేరే ఆస్తులున్నయి రాముడికి. పాస్తుల సంగతేమో మనకు తెలీదు. తోటరాముడికి తిని తిరగటం, కాలుమీద కాలు వేసుక్కూచోటం బాగా తెల్సు. ఇవి మాత్రమే తెల్సినవాడు ఒక్క పనీపాటా తెలీని పల్లెటూరి బైతు అని మాత్రం అనుకోడానికి లేదు. మనిషి తెలివి మీరడానికి, పుంజుకోడానికి తగ్గ చదువు అబ్బింది. దిన పత్రికలే కాదు పెద్దవీ లావువీ అయిన పుస్తకాలు చదవడం, లోకంలో ఏం జరుగుతున్నదో నిత్యం తెల్సుకోవడం చేస్తూ వుంటాడు.
తోటరాముడిలా ఇంకా చెప్పుకోదగ్గ ఉత్తమ గుణాలు లేకపోయినా ఒకటి మాత్రం చెప్పుకోకతప్పదు. తోటరాముడికి ఏ విషయమైనా ఎదురుపడ్డదంటే ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించుకోవడం, వాటికి ‘ఆప్షన్లు’ లేకపోయినా ‘కరెక్టు’ సమాధానాలు వెదుక్కోవడం వెన్నతిండంతో కాకపోయినా, చద్దన్నం తిండంతో అలవాటయిన విద్య. ఈ విద్యలో తోటరాముడు పట్టువదలని విక్రమార్కుడనేది మాత్రం ముమ్మాటికే కాదు ముమ్మాటికీ నిజం.
ఒకానొక నాడు ఏదో ఓ పేపర్లో ‘నాసా’ వారు ఆకాశమార్గంలో నిలబడో, కూచునో వున్న యంత్రంతో కెమెరాలో ఫొటోలు తీసినప్పుడు భూమ్మీద భారద్దేశమూ, దానికి ప్రహరీ గోడలా వున్న హిమాలయ పర్వతాలు రికార్డయ్యాయట. అక్కడితో సరిపోక ఆ పొటోల్లో మంచుకొండల్లో ఎవరి ‘డిస్ట్రబెన్స్‌’ లేకుండా తప్పస్సు చేసుకుంటున్న శంకరుడు కనిపించాడట. ఈ విషయం ఏ పత్రికలో వచ్చిందో మనకు తెలీదు. కానీ తోటరాముడికి తెల్సు. తనకు తెల్సిన ఈ సంగతిని ఆ రాముడు ఆషామాషీగా తీసుకోలేదు. పట్టు వదలని విక్రమార్కుడనే మాట నిజం చెయ్యాలని, ఊరికే ఊళ్లో తినితొంగుంటే ఏం వస్తుందని, హిమాలయాల్లో, కైలాసంలో శంకరుడనే వాడు వున్నాడని, ఫొటోల్లో కనిపించాడని అంటున్నారు కదా. అదెంత నిజమో తెల్సుకుందామని బయలుదేరాడు.
తోటరాముడు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ అంతుకనుక్కుందామని ఊరు వదిలేశాడనగా దాటేశాడన్న మాట. నేలమీద పరుగెత్తే బస్సెక్కాడు, కచ్చితంగా పట్టాలమీద పరుగెత్తే రైలు ఎక్కాడు, గాలిలో గిరికీలు కొట్టే విమానమూ ఎక్కేశాడు. ఏది ఏమైతేనేం, ఏది ఎలాగైతేనేం ఎట్టకేలకు, చిట్టచివరకు దేశానికి చిట్టచివరకు వున్న హిమాలయాల్లో ‘ల్యాండ’య్యేడు. అక్కడ్నించి ‘ఆపరేషన్‌ శంకర్‌’ మొదలుపెట్టాడు. నడిచాడు, ఉరికాడు, గెంతాడు, పాకాడు, ఎక్కాడు, తాడుమీద వేలాడేడు. పట్టువదలకుండా, పట్టుసడలకుండా పరిశోధన, అన్వేషణ సాగదీశాడు.
మంచి గుహల్లో దూరాడు, మంచు గుహల్లో దూరాడు. బారు గడ్డాల్ని చూశాడు. బవిరి గడ్డాల్ని చూశాడు. మాసిన జుట్ల వాళ్లనడిగాడు, గోచీలు బిగించి ఒంటికాలుమీద ధానం చేస్తున్న వాళ్లని ‘ఎంక్వైరీ’ చేశాడు. ఇలాగ ‘అష్ట’కాదు, ‘అష్టాదశ’ కష్టాలు పడి ఆ అయిస్‌ ఫారెస్ట్‌లో ఓ మారుమూల కొండమీద ఏకాకిలా వున్న ఓ మంచు గుహలో మూసిన కన్ను తెరవకుండా డీప్‌ మెడిటేషన్‌లో వున్న ఓ ఆకారాన్ని చూశాడు. ఇంత లోన్లీగా వున్న చోట, గడ్డ కట్టిన మంచు కరిగిపోవడం చాతవక నిట్టనిలువుగా, అడ్డగోలుగా నిలబడిపోయిన చోటవున్న ఈ మానవుడే ఆదిశంకరుడని పూర్తిగా కన్ఫర్మ్‌ అయిపోయాడు.
‘శంకర్‌ శంకర్‌’ అని ఆ మనిషి భుజం పట్టుకు వూపాడు. కదలడం లేదని మరోపేరుతో పిలిస్తే పలుకుతాడు కదా అని ‘శివశివా, హరహరా, హరోంహరా’ అని వీలయినంత బిగ్గరగా అరిచాడు. కళ్లు మూసుకున్న వ్యక్తి బాగా ఇరిటేట్‌ అయి కళ్లు తెరిచాడు. ‘యురేకా యురేకా’ అన్నాడు. తోటరాముడు
‘ఎవర్రా నువ్వు. నా మానాన నన్ను వుండనివ్వు’ అన్నాడు తోటరాముడు, శంకరుడని అనుకున్నవాడు.
నేనెవరయితేనేం కానీ నువ్వు మాత్రం శివుడివే. నేను కనిపెట్టేశాను. నాసా వారు ఉత్తి ఫొటోతో సరిపెట్టుకున్నారు కానీ ఈ తోటరాముడు అలా కాదు, పట్టువదలని విక్రమార్కుడే అన్నాడు తోటరాముడు.
ఏంట్రా నువ్వనేది? నేను శివుడినా? నువ్వు నువ్వేనా? నీ ఒంట్లో డ్రగ్గేదైనా గందరగోళం చేస్తున్నదా? అన్నాడు తోటరాముడు శంకరుడని అనుకున్నవాడు.
నిన్ను చూశాక ఏ డ్రగ్గూ, ఏ గంజాయీ అక్కర్లేదు. ఆ ఆనందానికి అడ్రసే లేదు. నువ్వే శంకరుడివీ, శివుడివీ, మహాదేవుడివీ అన్నాడు తోటరాముడు తన్మయత్వంతో సగం మూసుకున్న కళ్లతో.
నీ మెదడులో చిన్నదో, పెద్దదో సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా. నా పేరు శంకరే కానీ, నేను నిజం శివుణ్ణీ, శంకరుణ్ణీ కాదు. పిచ్చోడా శివుడికి మూడోకన్నుంటుంది. నాకుందా చూడు అన్నాడు శంకర్‌.
తోటరాముడికి శంకరనేవాడి నుదుట విబూది గీతల మధ్య ఎర్రటి కుంకుమబొట్టు కొట్టవచ్చినట్టు కనిపించింది. అదిగో మూడవ కన్ను పైకి కనిపించకుండా కుంకం బొట్టు పెట్టావు, నాకు తెల్సు అన్నాడు తోటరాముడు.
ఒరేరు! నీకెలా చెప్పేదిరా. చూడు చూడు… నా మెళ్లో నాగుపామేదీ? లేదుగా అన్నాడు శంకర్‌.
జైల్లో వుండే ఖైదీలనే పెరోల్‌ మీద కొంపకు పంపుతారు. పెళ్లాం పిల్లల్ని చూడడానికి పర్మిషన్‌ తీసుకుని వెళ్లుంటాడులే. ఇక నీ జుట్టులోపల ఎక్కడో గంగమ్మ వుండాలి. కానీ ఆవిడ్ని చూడాలని ప్రయత్నిస్తే ఈ శాల్తీ కొట్టుకుపోగల్దు. నువ్వు వెయ్యీ, లక్షా కోటీ చెప్పు… నువ్వే ఈశ్వరుడివి, పరమేశ్వరుడివి అన్నాడు తోటరాముడు కరాఖండీగా.
పోనీ ఇది చెప్పు నా పక్కన నా ‘బెటర్‌ ఆఫ్‌’ అనగా నా శ్రీమతి వుండాలి. మరి లేదుగా అన్నాడు శంకర్‌.
ఎందుకుంటుందీ.. నువ్వే అన్నావుగా బెటర్‌ ఆఫ్‌ అని. ఆమె నీలోనే వున్న అర్ధభాగం. నా ఈ పాపిష్టి కళ్లకు కనిపించడం లేదంతే. ఇక మాటలొద్దు. నిన్ను మా వాళ్లందరికీ చూపించాలి. నా వెంట రా అని మొండికేశాడు తోటరాముడు.
ఒట్టి శంకర్‌నే కాని భోళా శంకరుడ్ని కాదంటే నమ్మవు. ఇల్లు వదిలి వచ్చి చాలా కాలమయింది. నాకూ ఈ గుహ వదిలి రావాలనే వుంది. జేబులో కాపర్సు, కరెన్సీ నోట్లు లేక వుండిపోయాను. టీఏ, డీఏ ల సంగతి చూసుకుంటానంటే వస్తాను పద అని బయలుదేరాడు శివుడు కాని శంకర్‌!
ఢిల్లీకి చేరుకునేలోపు తను నిజంగా శంకరుడు కాదని తోట రాముడికి ఎన్నో విధాల చెప్పాడు శంకర్‌. కానీ తోటరాముడు ఇయర్‌ఫోన్‌లో పాటలు తప్ప ఏమీ వినిపించుకోలేదు. అలా శంకర్‌ని తీసుకువచ్చి ఎలక్ట్రోరల్‌ బాండులు అనేకం ఇప్పించి ఓ పార్టీ వారిని గుప్పిట్లో పెట్టుకున్న ఓ రాజకీయ నాయకుడికి అప్పగిస్తే, ఆయన ఈ విషయం తేల్చమని శంకర్‌ని ఈడీ వారికి అప్పగించేశాడు. కోడిగుడ్డుకైనా ఈకలు పీకే ఈడీవారు శంకర్‌ నిజంగా శంకరుడు అవునో కాదో తేల్చటానికి, కస్టడీలోకి తీసుకుని వూరూ, వాడా, ఇల్లూ, వాకిలీ, బీరువాలూ, మంచాలూ సోదాలే చేస్తారో, లక్ష యక్ష ప్రశ్నలే వేస్తారో మనకు తెలీదు.
– చింతపట్ల సుదర్శన్‌, 9299809212