మంది సొమ్ము మంగళవారం

People's money is Tuesdayకొందరు మనుషులు తమకు వచ్చేది అయితే తెచ్చుకునేందుకు ఆరాట పడుతరు. ఇతరులకు ఇచ్చేది అయితే రేపు, మాపు అని నానపెడుతరు. వీల్లను ‘మంది సొమ్ము మంగళవారం తన సొమ్ము సోమవారం’ అంటరు. అంటే తనకు వచ్చేదైతే సోమారమే తెచ్చుకునుడు, ఇతరులది అయితే తెల్లారి మంగళవారం అన్న చందంగా వ్యవహరిస్తరు. స్వార్థం ఇంత పెరిగిందన్నట్టు. అట్లనే ఇలాంటి వాల్లనే ‘తన సొమ్ము అల్లం పొరుగోని సొమ్ము బెల్లం’ లెక్కన అంటరు. అంటే ఇతరుది బెల్లం తీసకపోండ్రి అని చెప్పినట్టు. అందుకే ఎవల సొమ్ము అయినా కనబడీ కనబడనట్టే వ్యవహరించాలనే ఆలోచన. దీనినే ‘తన సొమ్ము అయినా దాసుకుని తినాలె’ అనే సామెత పుట్టింది. ఇక్కడ సొమ్ము అంటే వస్తువు లేదా నగ అనే అర్ధంలో వాడుతారు. సొమ్ము అంటే ఎపిలిప్స్‌ అనే వ్యాధిని కూడా సొమ్ము రోగం అంటరు. అది వేరే సంగతి. అట్లాగే సొమ్ములు అంటే ఉత్తరాంధ్రలో దున్నపోతులు అనే అర్ధంలో వాడుతరు. ఆయా ప్రాంతాలను బట్టి పదాలకు అర్ధ వివరణ ఉంటుంది. పని చేస్తున్న దగ్గర యజమాని చెప్పింది చేసుడే వుంటది అంటరు. అందుకే ‘తవ్వెడు ఇచ్చిన కాడ తంగెల్లు పీకాలె’ అంటరు. తవ్వెడు అంటే రెండు సోలలు. సోల అంటే బియ్యం కొలిచే కొలమానం. రెండు సోలలు బియ్యంగాని, వడ్లు గాని ఇస్తే చెయ్యమన్న పని చేయాలి. అంటే తంగెడు చెట్లు పీకమన్నా పీకాలి అని అర్ధం. నిజానికి తంగెడు చెట్లు చెల్కల మొలుస్తయి. ఎవ్వరు వాటి తెరువు పోరు. తీసకపోరు కూడా. ఒక్క బతుకమ్మ పండుగకు తంగెడుపూలు అక్కెరకు వస్తయి. అయితె తంగెడు చెట్లు ఎండిపోయిన తర్వాత పొరుక ఉపయోగపడుతది. ఎందుకంటే కూలి ఇస్తుండు కాబట్టి పని చేయాలి, లేకుంటే ‘దంచినమ్మకు బుక్కిందే కూలి’ అన్న శాత్రం అయితది. వడ్లు దంచబోయిన ఆమె తాపకిన్ని నూకలు నోట్లె పోసుకున్నదట. అది చూసి కూలికి పిలిపిచ్చుకున్న యజమాని బియ్యం నూకలు బుక్కినవు కదా, సరిపోతయి, పో అన్నదట.

– అన్నవరం దేవేందర్‌, 9440763479