తీరంలో ఐపీఎల్‌ సందడి

తీరంలో ఐపీఎల్‌ సందడి– విశాఖలో నేడు ఢిల్లీ, చెన్నై ఢీ
విశాఖపట్నం : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందడి విశాఖపట్నం తీరానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి రెండు ఆతిథ్య మ్యాచులను విశాఖపట్నంలో ఆడనుంది. ఇందులో భాగంగా నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. మెగా మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇప్పటికే విశాఖకు చేరుకోగా.. ఐపీఎల్‌ వినోదం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్‌కింగ్స్‌, క్యాపిటల్స్‌ మ్యాచ్‌ నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం.
హ్యాట్రిక్‌ ఎవరికి : ఐపీఎల్‌17లో సూపర్‌కింగ్స్‌, క్యాపిటల్స్‌ విభిన్న ఆరంభాలను దక్కించుకున్నాయి. చెన్నై తొలి రెండు మ్యాచుల్లో సాధికారిక విజయాలు నమోదు చేయగా.. ఢిల్లీ రెండు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది. విదేశీ, స్వదేశీ క్రికెటర్ల సూపర్‌ ఫామ్‌తో సూపర్‌కింగ్స్‌కు ఎదురు లేదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌ పరిస్థితి దారుణం. బంతితో, బ్యాట్‌తో ఆ జట్టు కనీస పోటీ ఇవ్వటం లేదు. ఓవరాల్‌గా పోరాటతత్వమే లోపించింది. క్యాపిటల్స్‌ను గట్టెక్కించగల సమర్థ ఆటగాళ్లు ఆ శిబిరంలో కరువయ్యారు. సూపర్‌కింగ్స్‌ నెగ్గితే ఆ జట్టుకు హ్యాట్రిక్‌ విజయం కానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అది హ్యాట్రిక్‌ ఓటమి అవుతుంది. రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌, శివం దూబె, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, మతీశ పతిరణలు సూపర్‌కింగ్స్‌కు… రిషబ్‌ పంత్‌, మిచెల్‌ మార్ష్‌, పృథ్వీ షా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ క్యాపిటల్స్‌కు కీలకం కానున్నారు.