దొంగ బాబాలను నమ్మొద్దు

దొంగ బాబాలను నమ్మొద్దు– ప్రభుత్వ భూములు ఆక్రమించి మోసాలు : తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
దొంగ బాబాలు, స్వామీజీలు ఆశ్రమాల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించి మోసాలు చేస్తున్నారని, వారిని నమ్మొద్దని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. దొంగ బాబాలు.. స్వామీజీలను నమ్మొద్దంటూ మూఢనమ్మకాల నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కొంతమంది బాబాలు, దొంగ స్వాముల వేషం వేసుకొని అతీంద్రీయశక్తులు ఉన్నాయని, వాటితో మీ జీవితాలను మారుస్తామంటూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. అలాంటివారిలో రామదూత అనే ఓ దొంగస్వామి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తుండగా.. అక్కడి హేతువాదులు అతనికి వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. దాంతో ఆయన అక్కడి నుంచి పారిపోయాడన్నారు. పారిపోయిన ఆ దొంగ స్వామి హైదరాబాద్‌లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని శనివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో దీక్ష పేరుతో యాగం చేయడానికి ప్రచారం చేస్తున్నాడని తెలిపారు.
ఇలాంటివారి మోసాలను రట్టుచేస్తూ.. దొంగ బాబాలను తక్షణమే అరెస్టు చేయాలని, జీవిత కాల శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. బాబాల పేరుతో చెలామణి అవుతున్న వారిలో చాలా మంది ఆశ్రమాల్లో హత్యలు, లైంగికదాడులు, భూ కుంభకోణాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు, చెక్‌ బౌన్స్‌ ఘటనలు ఇలా ఎన్నో బయటపడినా ఇంతవరకు ప్రభుత్వాలు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ది డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీ యాక్ట్‌ 1954 కింద అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు, ప్రభుత్వాలు దొంగ బాబాలకు ఆశ్రయమిస్తే.. ఆ గేట్ల దగ్గర హేతువాద సంఘాలు కాపలా కాస్తాయని హెచ్చరించారు. బాబాలు ఆక్రమించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య, జనవిజ్ఞాన దర్శిని నాయకులు రమేష్‌, జేవీవీ నాయకులు టివి.రావు, మానవ వికాసవేదిక నాయకులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.