మా ఊరు యాదికొస్తే కళ్ళల్లో కరిగిపోని
తాజా జ్ఞాపకాల ముంజకాయలు
బావులలోతుల్ని కొలిచే ఈతలు
భూగోళాలతో సీసంగోలీలాటలు
వెన్నెలకుప్పల సందమామలు
జిల్లాగోనేలు.. బాల్యంకొమ్మల్లో కోతికొమ్మచ్చి..
ఎన్నో… ఎన్నెన్నో… బయటపడిన తవ్వకాలు
ఈ యాంత్రికజీవిని బతికించే సజీవక్షణాలు..
ఊరంటే!
శ్రమైకజీవుల పనిముట్ల సింఫని రాగమే
వత్తులన్నిటితో పేనిన సప్తవర్ణాలమోకే
శతాబ్ధాలైనా చెరిగిపోని స్మతులబొడ్రాయే
ఊరంటే!
సమిష్టి జీవనవర్ణచిత్రమై
బహుజన సమూహాలతో
పెనవేసుకున్న మానవసంబంధమే
బతుకు పోరాటాల విన్యాసాలతో
ఊరుబండిని నడిపించే ఐకమత్య ఇరుసులే…
నర్సయ్య సుత్తె దెబ్బలైనా…
గోపాలు సారే శబ్దాలైనా…
కాశీము సాకిరేవు మోతలైనా…
సత్యమయ్య బాడ్సే విన్యాసాలైనా…
పిచ్చయ్య కత్తెరసప్పుళ్లైనా
ఊరి ఉనికికి చిరునామాలే
అరె పిచ్చయ్య అంటే!
నా చిన్నప్పుడు
మంగలి పిచ్చయ్యని ఊర్లో అందరూ
మంగలి పిచ్చోడు అని పిల్చేటోల్లు
చానారోజులు పిచ్చయ్య ఎక్కడ కనిపించినా
నేను పిచ్చోడనే అనుకునేటోన్ని
పీటమీద కూసోబెట్టుకొని
నా తలను మోకాళ్ళమధ్యపెట్టుకొని
నెత్తికి మునివేళ్లతో సుతారంగ నీళ్లురాసి
తన వేళ్ళకత్తెర చేసే కరకర శబ్దాలపదునుతో
సగరం చేసేవరకు నేను గట్లనే అనుకునేటోడ్ని
పిచ్చయ్య పిచ్చోడు కాదని
కొంచం పెద్దయ్యాకనే ఎరకయ్యింది
ఇప్పట్లాగ అప్పుడు అద్దాల షాపుల్లేవాయే
చుట్టూ తిరిగే కుర్చీల్లేవాయే
మా ఊర్లో సగరం చేయించు కోవాలంటే
ఎంతపెద్ద ఆసామైనా
మంగలిపిచ్చయ్య పీటమీద కూసోవాల్సిందే
ముందు తలకాయ వంచాల్సిందే
మంగలివత్తికి ఊరికి
మల్లెకి పాదుకి ఉన్న అనుబంధం
మంగలిలేని ఊరును ఊహించగలమా!
శుభకార్యాలైనా.. అశుభకార్యాలకైనా..
చేసేది ఆస్థాన మంగలి పిచ్చయ్యే
– డా||బాణాల శ్రీనివాసరావు, 9440471423