బీజేపీకి పట్టు దొరకదు

– వంద సార్లు పోటీ చేసినా తమిళనాడులో ఆ పార్టీ డ్రామా పని చేయదు
– ప్రధానికి ఎన్నికల్లో ఓటమి భయం : సీఎం స్టాలిన్‌
చెన్నై : బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల్లో వంద సార్లు పోటీ చేసినా.. వారికి ఇక్కడ పట్టు దొరకదని చెప్పారు. ”ఈ ఎన్నికలే కాదు.. వంద ఎన్నికలు వచ్చినా, మీ(మోడీ, బీజేపీ) డ్రామా తమిళనాడులో పని చేయదు” అని కృష్ణగిరిలో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం అన్నారు. తమిళనాడులో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలను మతం, కులం పేరుతో విభజించాలని చూస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం మోడీకి పట్టుకున్నదనీ, వారిపై భారతీయులందరూ ఆగ్రహంతో ఉన్నారని స్టాలిన్‌ అన్నారు. ”ఎన్నికల్లో ఈసీ, సీబీఐ, ఐటీలను మోడీ ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయాన్ని ఇది చూపెడుతున్నది. మోడీపై భారతీయులందరిలో కోపం ఉన్నది. అందుకే ఆర్థిక మంత్రి వంటి ఆ పార్టీ సీనియర్‌ నాయకులు భయంలో ఉండి, ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. బీజేపీ కనీసం నోటాకు తక్కువ కాకుండా ఉండాలి. అందుకే వారు జయలలిత, ఎంజీఆర్‌ను పొగుడుతున్నారు. జయలలిత బతికి ఉన్నపుడు మోడీ ఆమెను విమర్శించారు. జయలలిత ప్రభుత్వం అవినీతిమయమన్నారు. ఆ మాటలను ఆయన మరిచిపోయారా” అని స్టాలిన్‌ ప్రశ్నించారు. మహిళా రెజ్లర్ల నిరసనలు, మణిపూర్‌లో మహిళలు ఎదుర్కొన్న వేధింపుల విషయంలో కేంద్రం ‘నారీ శక్తి’ ట్యాగ్‌లైన్‌కు భిన్నంగా మోడీ తీరు ఉన్నదని అన్నారు.