గుడి పేరుతో కోటి విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా..?

– పట్టించుకోని రెవెన్యూ, మునిసిపల్ అధికారులు
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది.. నివాస గృహాలు పెరుగుతున్నాయి. ఖాళీ స్థలాలకు తీవ్రమైన డిమాండ్ ఉంది. పట్టణ శివారులో అయితే   గజం స్థలం  విలువ రూ.6. వేల నుంచి రూ.10. వేలు వరకు ఉంది. పట్టణంలో నివాస ఇండ్ల మధ్యలో అయితే.. గజం  స్థలం విలువ పదివేల వరకు ఉంటుంది. అలాంటిది పట్టణంలోని పాత బజార్ గాంధీ విగ్రహం ఎదురుగా దాదాపు 160 గజాల ప్రభుత్వ స్థలం  గుడి పేరుతో కబ్జా చేసి నాలుగు వ్యాపార దుకాణాలు నిర్మించారు. ప్రభుత్వ స్థలం దేవాలయం పేరుతో కబ్జా చేస్తే…రెవెన్యూ అధికారులు,  మునిసిపల్ అధికారులు ఏం చేస్తున్నారని పట్టణ ప్రజలు , ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్థలంలో మునిసిపాలిటీ స్వాధీనం చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహిస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది. కానీ అధికారులు ఈ దిశగా ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది.  బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో కోట్లు విలువ చేసే స్థలాన్ని దేవాలయానికి దార దత్తం చేయడానికి కుట్రలు చేశారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్  నిర్మాణం పనులు చేస్తున్నారు. ఈ స్థలం ప్రభుత్వాన్ని అంటూ కొందరు పెద్ద మనుషులు చెబుతున్నారు. పాత భవనం ఉన్నప్పుడు ఇందులో బాలవికాస కేంద్రం , అంగన్వాడి కేంద్రం ,  కొద్ది రోజులు రేషన్ డీలర్ షాప్ కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆస్తిని మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ను నవ తెలంగాణ వివరణ కోరగా.. ఈ విషయము తనకు తెలియదు వివరాలు తెలుసుకొని చెపుతాను అంటూ సమాధానం ఇచ్చారు.
మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకోవాలి: సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మల్లేష్ 
పాత బజార్ లో గాంధీ విగ్రహం ఎదురుగా ఉన్న స్థలంలో కొందరు అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నత అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.