– టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు మళ్లీ తలెత్తాయని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పంట వాడిపోవడానికి, ఎండిపోవడానికి కూడా తేడా తెలియని పెద్ద రైతు మన కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లాలో లక్షా 80 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులోని లక్ష ఎకరాల వరి పంట వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉందని తెలిపారు. కరెంటు పోవడం కారణంగా గుంట భూమి కూడా ఎక్కడా ఎండిపోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్ పొలంబాట అని కొత్త కథ మొదలు పెట్టారని విమర్శించారు. అధికారం లేకపోయేసరికి ఆయనకు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన సంగతి ఇంకా ప్రజలు మరిచిపోలేదని విమర్శించారు.
జనగామలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ, పంటలెండిపోతే, కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని కేసీఆర్ను ప్రశ్నించారు. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నదే నిజమైతే ఆ వివరాలివ్వాలని సవాల్ చేశారు.