– అన్ని తరగతులకూ ఉదయమే నిర్వహణ : టైం టేబుల్‌లో సవరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-2) పరీక్షలు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో అన్ని తరగతుల విద్యార్థులకూ ఉదయం పూట పరీక్షలను నిర్వహిస్తుండడం గమనార్హం. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారంటూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి సోమవారం సవరించిన టైంటేబుల్‌ను విడుదల చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు, ఆరు, ఏడు తరగతులకు ఉదయం తొమ్మిది నుంచి 11.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి 11.45 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకే జరుగుతాయని వివరించారు. జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. అదేరోజు తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహిస్తామనీ, మార్కుల రికార్డులపై తల్లిదండ్రుల సంతకాలను తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల డీఈవోలు ఎస్‌ఏ-2 పరీక్షల నిర్వహణపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.