ఎండలు మండుతున్నాయి..జాగ్రత్తలు తీసుకోండి

The sun is burning..take care– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏప్రిల్‌, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్‌ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం ఆమె హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, దాన కిషోర్‌, క్రిష్టినా చోంగ్తు, సందీప్‌ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, సీడీఎంఏ దివ్య, విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన, కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్‌ కర్ణన్‌, జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఈ రెండు మాసాల్లో ఉత్తర తెలంగాణా ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలో ఉష్టోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. అందువల్ల వేసవిలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు తగిన అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేశామనీ, వాటన్నింటినీ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఆశా కార్యకర్తలతో పాటు ఉపాధి హామీ పనుల కేంద్రాలవద్ద కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉదయం 11 గంటలనుండి సాయంత్రం 4 గంటల మధ్య పిల్లలు, వద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా ఎండదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత చర్యలను చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మంచినీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతీ మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు సీఎస్‌ తెలిపారు. ప్రతీ రోజు మంచినీటి సరఫరాను పర్యవేక్షించటానికి మండలానికి జిల్లా స్థాయి అధికారినీ, వార్డు, గ్రామానికి మండల స్థాయి అధికారిని నియమిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఏ గ్రామంలోనైనా మంచినీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే, ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బావుల నుంచి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని సూచించారు. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించాలన్నారు. ఇప్పటికే, అన్ని గ్రామాలు, వార్డులలోని బోరుబావుల మరమ్మతులు, ఫ్లషింగ్‌లను పూర్తి చేయడంతోపాటు పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టినట్టు సీఎస్‌ తెలిపారు.
కృష్టా జలాల విడుదల
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాలకు ఉదయం కృష్ణా జలాలను విడుదల చేసినట్టు సీఎస్‌ వెల్లడించారు. వీటిని పాలేరు ప్రాజెక్టుకు చేర్చేలా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
7,149 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రంలో 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, మరో నాలుగైదు రోజుల్లో ఈ కేంద్రాలన్నీ ప్రారంభమవుతాయని సీఎస్‌ తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో ప్రయివేటు కాంటాలను తెరిచి ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు కొనుగోళ్లు చేసే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో మన ఊరు -మనబడి కార్యక్రమం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులన్నింటినీ సంబంధిత ఏజెన్సీల ద్వారా వెంటనే ప్రారంభించి, వాటి పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు.