– ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
అక్కాతమ్ముడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ మధురనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్ నగర్ డివిజన్ సంతోష్గిరి బస్తీలో అక్క రాజేశ్వరి(30), తమ్ముడు బి.సాయి(28) నివసిస్తున్నారు. రాజేశ్వరికి వివాహం జరిగినా.. భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని కొన్ని సంవత్సరాలుగా తమ్ముడు వద్దనే ఉంటోంది. నెలలో రెండూ మూడు రోజులు అత్తింటికి వెళ్లి వచ్చేది. అక్కాతమ్ముడు ఇద్దరికీ కల్లు తాగే అలవాటు ఉంది. అయితే సోమవారం వారింట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అక్కాతమ్ముడు విగతజీవులుగా కనిపించారు. గదిలో రాజేశ్వరి రాసిన సూసైడ్ లెటర్ పోలీసులకు లభ్యమైంది. అందులో ”నా భర్త సరిగా పట్టించుకోవడం లేదు. దాంతో నా తమ్ముడు భర్త దగ్గరకు వెళ్లాలని రోజూ హింసిస్తున్నాడు. నా చావుకు నా భర్త, తమ్ముడే” కారణం అని పేర్కొంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మధురనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టర్ ఆత్మహత్య
భార్యతో గొడవపడిన ఓ జర్నలిస్ట్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూలుకు చెందిన రఘు హైదరాబాద్‌లోని బోరబండ సైట్ 3లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను ఓ టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, సోమవారం ఉదయం రఘు విధుల్లో భాగంగా బయటకు వెళ్లి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే భార్యాభర్తలు గొడవపడ్డారు. అనంతరం భార్య బిల్డింగ్‌పై బట్టలు తీసేందుకు వెళ్లింది. మళ్లీ గొడవ జరుగుతుందేమోనని చాలా సేపు అక్కడే ఉన్నది. ఆ సమయంలో రఘు క్షణికావేశంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తర్వాత భార్య కిందకు వచ్చి చూసి ఇరుగుపొరుగు సహాయంతో రఘుని కిందకు దించి సమీపంలోని శ్రావణి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. బోరబండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తుల్జారామ్ విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకుని మృతుడి భార్య, బంధువుల ద్వారా వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ దంపతులకు డిగ్రీ చదువుతున్న కూతురు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడు ఉన్నారు. రఘు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూతురు ఆలయానికి వెళ్లగా, కుమారుడు కాలేజీకి వెళ్లారు. మృతుడి తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ అని, అన్న కానిస్టేబుల్ అని.. వారు వచ్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలుకు తరలిస్తారని బంధువుల ద్వారా తెలిసింది. బోరబండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు