– రైతులను ఆదుకుంటాం, అధైర్య పడొద్దు
– కాంగ్రెస్ కరువుతెచ్చిందనడం విడ్డూరం : మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-కోహెడ
ప్రకృతి వైపరీత్యాన్ని గుర్తించకుండా కరువు పేరుతో బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని లక్ష్మిగార్డెన్స్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు పదవులు వచ్చే విధంగా చూస్తామన్నారు. కార్యకర్తలు కూడా సమన్వయంతో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వేసవికి ముందే భూగర్భ జలమట్టం పడిపోవడంతో నీటి సమస్య ఉత్పన్న మైందని తెలిపారు. కాంగ్రెస్ కరువు తెచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. కరువుకు కాంగ్రెస్ కారణమని చేస్తున్న దుష్ప్రచారాన్ని గ్రామాల్లో ఖండించాలన్నారు. మీరు ఓట్లు వేస్తే మంత్రిని అయ్యానని, నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవచేస్తానని స్పష్టంచేశారు. గ్యారంటీ స్కీములపై కరీంనగర్ ఎంపీ బండి సంజరు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ ఐదేండ్లలో నియోజకవర్గానికి ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఫొటో కాకుండా రాముడి ఫొటో పెట్టుకుని ఓట్లు అడిగే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందేలా తగు చర్యలు తీసుకుంటా మని చెప్పారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు అర్హులకందేలా చూడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పబ్బం గడుపుతున్నాయని తెలిపారు. భూ తగాదాలను గ్రామస్థాయిలోనేె పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని చెంచల్‌చెర్వుపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, నవగ్రహ ధ్వజ శిఖర యంత్రం ప్రతిష్ఠ మహౌత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు మంద ధర్మయ్య, మాజీ సర్పంచ్‌లు దొమ్మాట జగన్‌రెడ్డి, గొరిట్యాల లక్ష్మణ్, శెట్టి సుధాకర్, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు వేల్పుల వెంకటస్వామి, బందెల బాలకిషన్, బోయిని జయరాజ్, దూలం శ్రీనివాస్, అబ్దుల్ రఫీ, రాచూరి శ్రీనివాస్, రాజిరెడ్డి, గూడ స్వామి, తదితరులు పాల్గొన్నారు.