కాంగ్రెస్‌కు ఊరట

కాంగ్రెస్‌కు ఊరట– పార్టీపై బలవంతపు చర్యలుండవు
– సుప్రీంకోర్టుకు ఐటీ విభాగం వెల్లడి
– తదుపరి విచారణ జులై 24కు వాయిదా
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్‌ నుంచి రూ.1700 కోట్ల రికవరీ కోసం లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలాంటి బలవంతపు చర్యా ఉండబోదని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. ఐటీ శాఖ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కేంద్ర ఏజెన్సీ ఎన్నికల సమయంలో ఏదైనా పార్టీకి సమస్యలు సృష్టించాలనుకోవటంలేదని కోర్టుకు వివరించారు. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జులై 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసి ఫలితాలు విడుదలవనున్నాయి. ఐదేండ్లకు (1994-95, 2017-18 నుంచి 2020-21 వరకు) గానూ రూ.1823 కోట్లను చెల్లించాలని కొన్ని రోజుల కింద ఐటీ శాఖ కాంగ్రెస్‌కు నోటీసులు పంపిన విషయం విదితమే. అంతటితో ఆగకుండా, 2014-15 నుంచి 2016-17 సంవత్సరాలకు సంబంధించి రూ.1745 కోట్లు చెల్లించాలంటూ గత శనివారం కేంద్ర ఏజెన్సీ కాంగ్రెస్‌కు మళ్లీ తాఖీదులు అందించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ ఐటీ శాఖకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,567 కోట్లకు చేరింది. అంతేకాకుండా, గత బకాయిలను చూపిస్తూ కాంగ్రెస్‌ ఖాతాల నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను కూడా రికవరీ చేశారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఐటీ శాఖ నుంచి ఇలా వరుస నోటీసులు అందటం కాంగ్రెస్‌ను కలవరానికి గురి చేసింది. ఈ నోటీసులను ‘ట్యాక్స్‌ టెర్రరిజం’గా అభివర్ణించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీని ఆర్థికంగా దెబ్బ తీయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ విచారణ సోమవారం న్యాయస్థానం ముందుకు రావటంతో ఐటీ శాఖ పై విధంగా స్పందించింది. దీంతో ఇది కాంగ్రెస్‌కు ఒకింత మానసిక బలాన్ని అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.