– సిట్ ఇన్‌చార్జి కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి కెకె.మహేందర్‌రెడ్డి ఫిర్యాదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫోన్ ట్యాపింగ్‌లో ఉద్యమకారులను సైతం వదల్లేదని, వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ నాయకులు, సిరిసిల్ల ఇన్‌చార్జి కెకె.మహేందర్ రెడ్డి ఆరోపించారు. తన ఫోన్ ట్యాంపింగ్ చేశారని, విచారణను పారదర్శకంగా జరిపించాలని కోరుతూ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. సిట్ ఇన్‌చార్జి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని కలిసి కొన్ని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కెకె.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పాల్గొన్నారని, కానీ తెలంగాణ రాష్ట్ర ఫలితాలు మాత్రం ఒకే కుటుంబానికే వెళ్లాయన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఏలారని, పదేండ్లు వారికి ఇష్టమొచ్చినట్టు చేశారని ఆరోపించారు. భావస్వేచ్ఛకు, ప్రజాస్వామిక హక్కులు, పౌరహక్కులకు ఆటంకాలు కల్పిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తాము కేసీఆర్ కుటుంబంతో కలిసి మెలిసి తిరిగామని, అన్నదమ్ముండ్లుగా ఉండే వారమని గుర్తు చేశారు. అలాంటిది తమ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఓ వార్ రూమ్ ఏర్పాటు చేశారని.. ప్రణీత్‌రావును సిరిసిల్లలోనే అరెస్టు చేశారని అన్నారు. సెలబ్రెటీలు, అధికారులు, వ్యాపారులతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాంపింగ్ చేశారని తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ప్రభత్వంపైనా, కేటీఆర్‌పైనా ఫిర్యాదు చేశామని తెలిపారు. తన ఫోన్ సైతం ట్యాంపింగ్ చేయడంతో సిరిసిల్ల నాయకులు తనతో ఫోన్‌లో మాట్లాడాలంటే భయపడేవారని అన్నారు. నిజాయితీగా విచారించాలని, అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సానుకూలంగా స్పందించిన సీపీ అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని తమకు హామీనిచ్చినట్టు తెలిపారు.