నవతెలంగాణ- కందనూలు
నాగర్ కర్నూలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్లకు కనీస వేతనాల అమలు కోసం కలెక్టర్ వెంటనే చొరవ చూపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో కార్మికులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో దాదాపుగా 35 సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనతో పని చేస్తున్న ఇప్పటివరకు వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపలేదని ఆయన విమర్శించారు. కనీస వేతనాల జీవో వచ్చినప్పటికీ 330 పడకల జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి జీవో నెంబర్ 60 అమలు చేసి అదనపు సిబ్బందిని పెంచాలని కనీస సౌకర్యాలు కల్పించాలని ఆగస్టులో జీవో అమలు చేసి వేతనాలు పెంచమని చెబితే ఇద్దరు కాంట్రాక్టర్ల గొడవ మధ్య పది మాసాల వేతనం 16,500 కోల్పోయారని దీని మూలంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. కేవలం 32 మంది సిబ్బందితో 330 పడకల ఆసుపత్రిని ఏ విధంగా శుభ్రం చేస్తారని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ చూపి టెండర్ ప్రక్రియ తొందరగా ముగిసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికులకు రావాల్సిన 16,500 వేతనం వెంటనే వచ్చే విధంగా అదనపు సిబ్బందిని పెంచాలని కోరారు. వీటి అమలు కోసం జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ చూపి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య ,కార్మికులు బాలకృష్ణమ్మ ,రాధ, అలివేల, నిరంజన్, గిరి, వెంకటేష్ ,శేఖర్ ,బాలకృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.