కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

– భూ కబ్జా కేసులో ఏ1 నిందితుడు
– కొద్దిరోజులుగా పరారీలో
– అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు
నవతెలంగాణ-ఆదిభట్ల
భూ కబ్జా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతన్ని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆదిభట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మన్నెగూడ గ్రామంలోని సర్వే నెంబర్‌ 32లో రెండెకరాల పది గుంటల భూమిని కన్నారావు కబ్జా చేశారని బాధితులు గతంలో ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కన్నారావుతోపాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. గతంలో ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇన్నిరోజులు కన్నారావు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కన్నారావు కోర్టులో పిటిషన్‌ వేయగా కోర్టు తిరస్కరించింది. మంగళవారం ఉదయం బాలాపూర్‌లోని ప్రముఖ అడ్వకేట్‌ వద్దకు కన్నారావు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరిచారు.
కోర్టు కన్నారావుకు 14రోజులు రిమాండ్‌ విధించింది. దాంతో కన్నారావును చర్లపల్లి జైల్‌కి తరలించినట్టు సీఐ తెలిపారు.