కాంగ్రెస్‌ తలుపులు బార్లా తెరుస్తాం

కాంగ్రెస్‌ తలుపులు బార్లా తెరుస్తాం– పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేస్తాం
– ఊరూరా కాంగ్రెస్‌ కండువాలు కప్పుతాం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వరంగల్‌లో కాంగ్రెస్‌ తలుపులు బార్లా తెరుస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. పాలకుర్తిలో బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయిస్తామన్నారు. ఊరూరా కాంగ్రెస్‌ కండువాలు కప్పడాన్ని పండుగలా నిర్వహిస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు వెయ్యి మంది ఎర్రబెల్లి అనుచరులు కాంగ్రెస్‌లో చేరారు. పాత వాళ్లు ఎవరు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దని భరోసా ఇచ్చారు. ‘మీరు పడిన కష్టం మాకు తెలుసు.మీ వెంట మేము ఉంటాం. పార్టీ కోసం కష్టపడండి. ఎంపీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి లక్ష మెజార్టీ అందించాలి’ అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల బీఆర్‌ఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.