– కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రమణ
నవతెలంగాణ – ముషీరాబాద్
శ్రామిక రాజ్య స్థాపనే సర్వాయి పాపన్నకు నివాళి అని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రమణ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి సభను మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం హాల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.వి రమణ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యస్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారు. శ్రామిక రాజ్య స్థాపన లక్ష్యంగా పని చేసిన యోధుడని కొనియాడారు. పెద్దల నుంచి తీసుకుని పేదలకు పంచిన మహనీయుడని.. ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. నేడు కష్టజీవుల శ్రమను దోచుకుంటున్న ధనవంతులు, కోటీశ్వరులు రాజ్యం ఏలుతున్నారని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయి రాజకీయ నాయకులు కలుషితమవుతున్నారని తెలిపారు. అలాంటి వారిని ఛీ కొట్టాల్సిన రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మారుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ”పోరాడే వాడే పరిపాలనకు అర్హుడు” అని పోరాడి నిరూపించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పారు. సకలజన సైన్యాన్ని కలుపుకొని శ్రామిక రాజ్యం కోసం పోరుసల్పి వీర మరణం పొందారని.. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్.వినయకుమార్, టీపీఎస్‌కే రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి.రాములు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి రాజు నరేష్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం సీనియర్ నాయకులు అబ్బగాని భిక్షం, కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నరసయ్య, ఎం.కృష్ణ స్వామి, ప్రభాకర్, పొన్నం రాజయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.